జిల్లాలో టిఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రచారం వేగం
మంత్రుల ఇలాఖాలో జోరుగా ప్రచారం
మహబూబ్‌నగర్,సెప్టెంబర్24(జనంసాక్షి): టీఆర్‌ఎస్ అభ్యర్థులు జిల్లాలో తమ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఇప్పటికే ఒక విడత మండల స్థాయి టీఆర్‌ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. తాజాగా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో మంత్రి లక్ష్మారెడ్డి ప్రచారానికి రాగా హారతలుతో స్వాగతం పలుకుతున్నారు. టీఆర్‌ఎస్ శ్రేణులు, ప్రజలు ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన పాల్గొంటున్నారు. దేశంలో ఎక్కడ లేనన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు అసత్య ప్రచారాలు చేసే విపక్ష పార్టీలకు తగిన శాస్తి చేయాలన్నారు. లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో మళ్లీ గెలిపించుకుంటామని, సీఎం కేసీఆర్ ను తిరిగి ముఖ్యమంత్రిని చేస్తామని పలుచోట్ల ఆయనకు మద్దతుగా ప్రజలు ప్రకటించారు. జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రచారం జోరుగా సాగుతోంది. నది అగ్రహారంలోని స్పటిక లింగానికి ఆయన సతీమణి బండ్ల జ్యోతి పూజలు చేసి, గడపగడపకూ ప్రచారం నిర్వహించారు. ప్రతీ మహిళకి బొట్టు పెట్టి కృష్ణమోహన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ఆమెకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. దేవరకద్ర నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్ రెడ్డికి మద్దతు వెల్లువెత్తుతోంది. సీఎం కేసీఆర్ పథకాలకు ఆకర్షితులై.. భారీ ఎత్తున ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్ లో చేరుతున్నారు. ఆలను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రతినబూనారు.
మక్తల్ ఎమ్మెల్యే అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డికి ప్రజలంతా మద్దతుగా నిలుస్తున్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి? టీడీపీ నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ లో చేరారు. అటు కుసుమూర్తి గ్రామ ప్రజలు టీఆర్‌ఎస్ కే ఓటేస్తామని ఏకగ్రీవంగా తీర్మానించారు. చిట్టెం రామ్మోహన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. బిజినపల్లి మండల ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గత ప్రభుత్వాల హయాంలో కరెంటు వస్తే వింత ? టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కరెంటు పోతే వింతని మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఐతే అన్ని కష్టాలు తొలగిపోతాయని వివరించారు.