జిల్లాలో పదిసీట్ల కోసం కాంగ్రెస్‌ పట్టు

పొత్తుల కోసం గెలిచే సీట్లు వదులుకోవద్దని హితవు

కూటమి సీట్లు ఖరారు కాక నేతల్లో ఆందోళన

ఆదిలాబాద్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ జిల్లాలో విపక్షాల రాజకీయం రసకందాయంలో పడింది. కూటమి తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనే విషయంలో కూడా ఇప్పటివరకు స్పష్టత లేదు. కాంగ్రెస్‌ నేతలు మాత్రం ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలోని పది స్థానాల్లో తామే పోటీ చేయబోతున్నట్లు చెపుతున్నారు.ఉమ్మడి జిల్లాలో మూడు సీట్లు అడిగిన టీజేఎస్‌ తూర్పు, పడమరల్లో ఒక్కో సీటు అయినా ఇవ్వాలని కోరుతోంది. సీపీఐ రెండు సీట్లు అడిగి, ప్రస్తుతం మంచిర్యాల ఒక్క సీటైనా ఇవ్వాలని, లేదంటే పొత్తుతో సంబంధం లేకుండా పోటీ చేసి తీరుతామని అల్టిమేటం ఇచ్చింది. టీడీపీ నాయకులు అధిష్టానం పైనే భారం వేసి చూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని పది స్థానాలకు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అభ్యర్థులను ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా టికెట్ల కోసం పోటీలేని నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయగా, బీఎల్‌ఎఫ్‌ పలుచోట్ల పోటీ చేసే నాయకుల పేర్లు ప్రకటించింది. అధికార పార్టీకి ప్రధాన పోటీదారుగా భావిస్తున్న మహాకూటమి నుంచి అభ్యర్థులను ఇప్పటి వరకు ప్రకటించలేదు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పాల్గొన్న తొలి బహిరంగసభ భైంసాలో

నాయకులు కూడా ఊహించని రీతిలో విజయం కావడంతో కాంగ్రెస్‌లో ఉత్సాహం నిండింది. రాహుల్‌ గాంధీ సభలో ఆయన దృష్టిలో పడేందుకు నాయకులు పోటీపడ్డారు. దీంతో రాష్ట్రంలో నెలకొన్న పోటాపోటీ వాతావరణంలో సీటు దక్కించుకుంటే ఎమ్మెల్యే కావచ్చన్న ధీమా నాయకుల్లో ఉంది. ఈ నేపథ్యంలో 10 నియోజకవర్గాల్లో రెండుచోట్ల మినహా ఎనిమిది చోట్ల పోటీ నెలకొంది. నిర్మల్‌లో ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కు స్థానాల్లో మాత్రమే పోటీ లేదు. బీజేపీ తొలి జాబితాలో ఉమ్మడి ఆదిలాబాద్‌ నుంచి కేవలం నలుగురు అభ్యర్థులనే ప్రకటించింది. ఆదిలాబాద్‌లో పాయల్‌ శంకర్‌, ముథోల్‌లో రమాదేవి, బెల్లంపల్లిలో కొయ్యల ఏమాజీ, బోథ్‌లో మడావి రాజు అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. ఇందులో పాయల్‌ శంకర్‌, రమాదేవి గత ఎన్నికల్లో పోటీ చేసినవారే. మిగతా ఆరు చోట్ల ఒకరికన్నా ఎక్కువ సంఖ్యలో నేతలు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్‌ సీట్ల ప్రకటన తరువాత ఒకటి రెండు చోట్ల టికెట్టు రాని బలమైన నేతలు బీజేపీలోకి వస్తారేమో అనే ఆశ కూడా ఆ పార్టీలో ఉంది. అయితే కొత్తగా వచ్చే వారికి టికెట్లు ఇస్తే ఒప్పుకొనేది లేదని ఇప్పటి రకు పార్టీకి సేవలు చేస్తున్న నాయకులు గొంతు విప్పుతున్నారు.