జిల్లాలో సాధారణ ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం…: కలెక్టర్ వెంకట్రావు

తుంగతుర్తి నవంబర్ 29 (జనం సాక్షి)
జిల్లాలో నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి నేడు నిర్వహించనున్న సాధారణ ఎన్నికల కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను సందర్శించి తగు ఏర్పాటును పరిశీలించిన అనంతరం మాట్లాడారు పోలింగ్ చీట్టీ లేదని ఎవరు కూడా అధైర్య పడొద్దని, 12 రకాల గుర్తింపు కార్డులను ఎన్నికల సంఘం గుర్తించిందని, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలని కోరారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి 1201 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అందుకోసం ఎన్నికల సిబ్బందికి గతంలోనే ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చామని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించడంతోపాటు వృద్ధులకు సైతం ప్రత్యేక ఏర్పాట్లు కల్పించాలని తెలిపారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని అన్నారు. జిల్లాలో సమస్య ఆత్మక పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి వాటికి తగిన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని ఎవరైనా ఎన్నికల నియమాలను ఉల్లంఘించినట్లయితే వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవు అని అన్నారు. ఎన్నికల నిర్వహణను పరిశీలించేందుకు మైక్రో అబ్జర్వర్లను వెబ్ కాస్టింగ్ ను ఉపయోగించినట్లు తెలిపారు. ఈవీఎం యంత్రాలను ఉదయం ఐదు గంటలకే మాక్ పోలింగ్ నిర్వహించాలని అధికారులకు తెలిపినట్లు తెలిపారు. ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహించాలని తెలిపారు. ఎక్కడైనా ఈవీఎంల మొరాయిస్తే అధికారుల దృష్టికి తీసుకెళితే వెంటనే సరి చేస్తామన్నారు .ఎన్నికల నిర్వహణ నిమిత్తం సెక్టోరియల్ ఆఫీసర్లను నియమించామని తెలిపారు .ఎన్నికల సిబ్బందిని ఈవీఎం యంత్రాలతో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వారికి రక్షణగా పోలీస్ బందోబస్తు నియమించామని తెలిపారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఎవరైనా ప్రయత్నించినట్లు తమ దృష్టికి వస్తే వారిపై పోలీస్ కేసులు పెడతామన్నారు. తమకు కేటాయించిన రూట్ అధికారులు రూట్ మ్యాప్ చెక్ చేసుకుని ఈవీఎంలతోపాటు సెక్టోరియల్ అధికారి పిఓలు పోలింగ్ సిబ్బంది పోలీసులు కలిసి ఎవరికీ కేటాయించిన పోలీస్ స్టేషన్లకు సిబ్బందిని పంపుతున్నట్లు తెలిపారు. పోలింగ్ అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లకు తరలించేంతవరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు .
ఎన్నికల నియమావళి అమలులో ఉన్న దృష్ట్యా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ సమన్వయం పాటించి ఎన్నికలు సజావుగా జరిగేందుకు తమ వంతు పాటు పడాలి అని అన్నారు ఈ సమావేశంలో నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు