జిల్లా కేంద్రంలో ఇవిఎంల భద్రం
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు
ఆదిలాబాద్,డిసెంబర్8(జనంసాక్షి): ఎన్నికల నిర్వహణకు అనంతరం ఇవిఎంలను జిల్లా కేంద్రంలో భద్ర పరిచారు. వివిధ ప్రాంతాల నుంచి పోలీస్ భద్రత మధ్య సిబ్బంది శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ప్రత్యేక బస్సుల్లో వారు ఈవీఎం, వీవీప్యాట్ ఇతర సామాగ్రిని టీటీడీసీ కేంద్రంలో అధికారులకు అప్పగించారు. ఆ యంత్రాలను స్ట్రాంగ్‌రూమ్‌ల్లో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు నడుమ భద్రపర్చారు. పోలింగ్ సిబ్బంది తమ తమ గ్రామాలకు వెళ్లేందుకు వీలుగా కలెక్టర్ దివ్య దేవరాజన్ ప్రత్యేక బస్సుల సౌకర్యాన్ని ఏర్పాటు చేయించారు.గత ఎన్నికలతో పోల్చితే ఈసారి ఓటరు నమోదుపై ప్రజలు ఆసక్తి ప్రదర్శించారు. సవరణ జాబితాలో ఓట్లు గల్లంతు అయినప్పటికీ ఆతర్వాత ఓటు నమోదు చేసుకున్నారు. అధికార యంత్రాంగం ఓటు హక్కు వినియోగంపై వివిధ రకాల ప్రచారం చేసింది. దీంతో అత్యధికులు ఓటేశారు. ఊరూరా ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహించడం వంటి చర్యలు ఓటర్లను ముందుకు కదిలించాయి. ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలోనూ అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించి ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించడం.. ఓటునమోదుపైనా విస్త్రృత ప్రచారం కల్పించడంతో ఎంతోమంది ముందుకొచ్చి ఓటు నమోదుతో పాటు ఓట్లు వేసేందుకు ఆసక్తి కనపర్చారు. ప్రధానంగా దివ్యాంగులకు, వృద్ధులకు, బాలింతలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం కూడా పోలింగ్ శాతం పెరుగుదలకు దోహదపడింది. పోలింగ్ కేంద్రాల్లో చంటిపిల్లలతో వచ్చే తల్లులకు ప్రత్యేకంగా ఫీడింగ్‌రూమ్‌లను ఏర్పాటు చేసి పాలు పట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దివ్యాంగులను, వృద్ధుల కోసం మూడు చక్రాల బళ్లను అందుబాటులో ఉంచిన ఐకేపీ సిబ్బందిని వారిని పోలింగ్ కేంద్రాల వరకు తీసుకెళ్లి తిరిగి వారి గమ్యస్థానాలకు చేర్చడం కూడా పోలింగ్ నమోదుకు కారణమైంది.