జిల్లా బిజెపిలోనూ తొలగని అనిశ్చితి
గుర్రుగా ఉన్న అసమ్మతి నేతలు
ఖరారు కాని మంచిర్యాల, చెన్నూరు
ఆదిలాబాద్,నవంబర్3(జనంసాక్షి): భారతీయ జనతా పార్టీ రెండో విడత అభ్యర్థుల ప్రకటన తరవాత ఇక్కడా అసంతృప్తి రేగుతూనే ఉంది. టిక్కెట్లు ఆశించి భంగపడ్డ వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు మంచిర్యాల,చెన్నూరు టిక్కెట్ల విషయంలో పార్టీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి నలుగురి పేర్లను ఖరారు చేసింది. పోటాపోటీగా కొనసాగిన నిర్మల్ నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ సువర్ణరెడ్డి, ఖానాపూర్‌కు సట్ల అశోక్, సిర్పూర్‌కు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, ఆసిఫాబాద్‌కు ఆజ్మీరా ఆత్మారాం నాయక్‌లను ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. మంచిర్యాలతో పాటు పక్కనే ఉన్న చెన్నూరు స్థానాలకు రెండో విడతలోనూ అభ్యర్థులను ఖరారు చేయలేదు. మంచిర్యాల నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు ముల్కల్ల మల్లారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఇటీవల పార్టీలో చేరిన ఎన్‌ఆర్‌ఐ వెరబెల్లి రఘునాథరావు ఆయనకు పోటీగా మారారు. మల్లారెడ్డి, రఘునాథరావు వర్గాలు ఎవరికి వారు తమవంతు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. చెన్నూరు నియోజకవర్గంలోనూ రాం వేణు, అందుగుల శ్రీనివాస్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో టికెట్ కేటాయింపుల తర్వాత అసమ్మతి తలెత్తేందుకు అవకాశాలు ఉండడంతో పార్టీ ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. నిజానికి ఈ దఫా బిజెపిలో
కూడా పోటీ పెరిగింది. ఒక్కో నియోజకవర్గంలో కనీసం ఐదుగురు పోటీ పడ్డారు. ఇప్పటికే ఆదిలాబాద్, బోథ్, ముథోల్, బెల్లంపల్లి స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాలకు గానూ ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ మంచిర్యాల, చెన్నూరు సీట్లను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. ఇక్కడ నెలకొన్న పోటీ పరిస్థితుల కారణంగానే ఈ రెండింటిలో పేర్లను ప్రకటించలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇకపోతే రెండునెలల కిందటే పార్టీలో చేరిన స్త్రీవైద్య నిపుణురాలు సువర్ణరెడ్డిని నిర్మల్ అభ్యర్థిగా ప్రకటించారు. ఇక్కడ రెండేళ్లుగా పార్టీలో ఉంటూ టికెట్ ఆశించిన మరో వైద్యుడు కాలగిరి మల్లికార్జున్‌రెడ్డికి నిరాశ తప్పలేదు. రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం, ప్రజల్లో స్త్రీవైద్య నిపుణురాలిగా పేరు ఉండడం, మహిళ కావడం ఆమెకు కలిసి వచ్చింది. పార్టీలో చేరక ముందు చేపట్టిన సేవా కార్యక్రమాలు, పాదయాత్ర సైతం ఆమె వైపు మొగ్గు చూపడానికి కారణమైనట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాలోని ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో ఒక్కటైన ఖానాపూర్‌లో బీజేపీ ఆదివాసీ నాయక్‌పోడ్ వర్గానికి చెందిన సట్ల అశోక్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. గతంలో ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ వనవాసీ కల్యాణ్ పరిషత్‌లో పనిచేసి ఉండడం, యుక్త వయసులోనే రాజకీయ నేపథ్యం, ఆదివాసీ కావడంతో ఇక్కడ ఆయనకు అవకాశం దక్కింది. సిర్పూర్ నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్‌ను పార్టీ ఖరారు చేసింది. కాగజ్‌నగర్‌లో ఆసుపత్రి ద్వారా వైద్యసేవలను అందిస్తూ.. పలు సామాజిక కార్యక్రమాలను చేపడుతున్నారు. లయన్స్‌క్లబ్ అధ్యక్షుడిగానూ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు. ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గమైన ఆసిఫాబాద్‌లో ఇటీవల పార్టీలో చేరిన అజ్మీరా ఆత్మారాం నాయక్‌కు బీజేపీ అవకాశమివ్వడం ఆసక్తిగా మారింది. రెబ్బెన మండలం గోలేటి గ్రామపంచాయతీ పరిధిలోని కైరిగూడకు చెందిన ఆత్మారాం నాయక్ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఇటీవలే టీఆర్‌ఎస్‌లో నుంచి ఆయన బీజేపీలో చేరారు. నెల వ్యవధిలోపే ఆయనకు బీజేపీ టికెట్ ఖరారు చేసింది.