జిల్లా స్కూళ్లకు బయోమెట్రిక్ మంజూరు
సిద్దిపేట,మే2( జనం సాక్షి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సమయపాలన సమస్యగా మారుతోంది. పైగా ఉన్నతాధికారుల ఆకస్మిక తనిఖీ, పర్యవేక్షణ అంతంతమాత్రంగానే ఉంది. దీంతో సకాలంలో బడికి రాని ఉపాధ్యాయులు, విద్యార్థుల వల్ల విద్యాప్రమాణాలు కుంటుబడుతున్నాయి. వైఫల్యాన్ని గుర్తించడంలో ఇన్నాళ్లు అధికారులు విఫలమాయ్యరు. త్వరలో అమలు చేసే విధానం వల్ల పారదర్శకత పెరుగనుంది. గతంలోనే జిల్లాలో ఈ పక్రియను అమలు చేయాలని విద్యాశాఖ అధికారులు భావించారు. ఇందులో భాగంగానే కొన్ని మారుమూల ప్రాంతాల్లో పరికరాలను అమర్చారు. వాటి వినియోగంలో లోపాలు కనిపిస్తున్నాయి. సిగ్నలింగ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం.. కొన్నాళ్లకే వాటి నిర్వహణ విస్మరించడం లాంటి చర్యల వల్ల ఇబ్బంది తప్పడంలేదు.కేంద్ర మానవ వనరులశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఐదు వేల పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరును అమలు చేసేందుకు నిధుల్ని అందించనుంది. ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంతోపాటు పరికరాల కొనుగోలుకు పచ్చజెండా ఊపింది. నాణ్యమైన విద్య ప్రతి పేద విద్యార్థికి అందాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయి. అక్షరజ్ఞానాన్ని పొందుతున్న విద్యార్థుల ప్రయోజనానికి పెద్దపీట వేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వసతుల కల్పనతోపాటు విద్యార్థి సంక్షేమానికి పాటుపడుతోంది. దీనికితోడుగా కేంద్ర ప్రభుత్వం విద్యారంగాన్ని మరింత బలోపేతం
చేసే దిశగా యోచిస్తోంది. ఇందులో భాగంగానే బయోమెట్రిక్ ఏర్పాటు కానుంది. జిల్లాలో 6 నుంచి 10వ తరగతి బోధించే పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఒక్కో పాఠశాలలో ఒక్కోటి ఏర్పాటు చేయడం వల్ల జిల్లాలో పాఠశాలకు వచ్చే ఉపాధ్యాయులు, విద్యార్థుల సమయపాలన పక్కాగా అమలవనుందని అధికారులు భావిస్తున్నారు.