జీవీఎల్ చెప్పినవన్నీ అబద్దాలే
యూసీలపై అధికారులు చెబుతున్నా పట్టించుకోరా?
క్షేత్రస్థాయికి వెళ్లి పనులు చూసిన తర్వాత మాట్లాడండి
కన్నా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆధారాలుంటే బయటపెట్టాలి
ఫోన్ ట్యాపింగ్ కేంద్ర పరిధిలోని అంశం
అగ్రిగోల్డ్ వివాదంపై ప్రభుత్వం పారదర్శంగా వ్యవహరిస్తుంది
అసహనంతో కాదు.. ఆలోచించి మాట్లాడాలి
ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు
అమరావతి, జూన్6(ఆర్‌ఎన్‌ఎ) : బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు అబద్దాలను వల్లిస్తూ అవే సత్యాలన్నట్లు మాట్లాడటం సిగ్గుచేటని, పనులపై స్పష్టత రావాలంటే జిల్లా కేంద్రంలో కూర్చొని మాట్లాడితే సరిపోదని, క్షేత్రస్థాయిలోకి వెళ్లి చూస్తే పనుల తీరు అర్థమవుతుందని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబారావు అన్నారు. జీవీఎల్ వ్యాఖ్యలపై విజయవాడలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో కుటుంబరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జీవీఎల్ చెప్పినవన్నీ అబ్దాలేనని అన్నారు. అభివృద్ధి అంతా కాగితాలకే పరిమితమైందన్న నరసింహరావు.. ఆ విషయాన్ని గ్రామాల్లో పర్యటించిన తర్వాత చెప్పాలని సవాల్ చేశారు. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే ప్రభుత్వ అధికారులపై నమ్మకం లేనట్లుగా ఉందన్నారు. జీవీఎల్ వ్యాఖ్యల్లో అసహనం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. స్టాక్ మార్కెట్‌లో పనిచేసిన వ్యక్తులు అడ్మినిస్టేషన్‌లో ఉండకూడదా? అని ప్రశ్నించారు. ఏ రంగంలోనైనా నిపుణులైన వారిని ప్రభుత్వాలు సలహాదారులుగా నియమించుకోవడం సాధారణమేనన్నారు. జీవీఎల్ నరసింహరావు మాట్లాడిన తీరుతో ఆయనపై గౌరవం పోయిందని కుటుంబరావు అన్నారు. నిజాలు చెప్పాలని అడిగితే అసహనానికి ఎందుకు గురవుతున్నారో అర్థం కావడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవిస్తుందని.. కానీ 150కి మించి సీట్లు రావని కుటుంబరావు తెలిపారు. జీవీఎల్ తన వ్యాఖ్యలను రాసుకుని ఎన్నికల ఫలితాల తర్వాత చూసుకోవాలన్నారు. జీవీఎల్ రాష్ట్ర ప్రభుత్వంపై ఇకనైనా తన లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని కోరారు. ఏ విషయంపైనా స్పష్టత లేకుండా గూగుల్‌లో సెర్చ్ చేసుకుని వచ్చి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అగ్రిగోల్డ్ కేసు అంశంలో ప్రతిపక్ష నేత జగన్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కుటుంబరావు మండిపడ్డారు. అగ్రిగోల్డ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఎవరికైనా అనుమానాలుంటే హైకోర్టులో ఇంప్లీడ్ కావాలని సూచించారు. కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవాలన్న దురుద్దేశంతోనే ప్రతిపక్ష పార్టీ దీన్ని రాజకీయం చేస్తోందన్నారు. అగ్రిగోల్డ్ వివాదంపై ప్రభుత్వ అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఆర్థిక ఉగ్రవాదులైన జగన్, విజయసాయిరెడ్డిలు ఏ అంశానైన్నా రాజకీయం చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
తన పట్ల జీవీఎల్ చులకనగా మాట్లాడుతున్నారని కుటుంబరావు అన్నారు. జీవీఎల్ వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఫోన్‌ను ట్యాపింగ్ చేసినట్టు విమర్శలు చేయడం కాదని, ఆధారాలు ఉంటే బయటపెట్టాలని కుటుంబరావు సవాల్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేంద్రం పరిధిలోని అంశమని అన్నారు. జీవీఎల్ ఇప్పటికైన తన తీరుమార్చుకొని నిజాలు తెలుసుకున్న తరువాతే మాట్లాడాలని కుటుంబరావు హితవు పలికారు.