జీవో 123 అమలుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్..మధ్యంతర ఉత్తర్వులు జారీ

-సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై స్టే
-మధ్యంతర ఉత్తర్వులు జారీ
-ప్రయోజనాలపై జీవో తేవాలని ప్రభుత్వానికి ఆదేశం
-జీవో పరిశీలించాకే రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తామన్న న్యాయస్థానం
-తీర్పునకు లోబడే కొనుగోళ్లు.. తదుపరి విచారణ రేపు

joహైదరాబాద్,:భూసేకరణ చట్టం 2013 నిబంధనలకు లోబడి జారీచేసిన జీవో 123 వ్యవహారంపై మంగళవారం ఉమ్మడి హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. జీవో 123 అమలును నిలిపివేస్తూ గతవారం హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం జారీచేసిన ఉత్తర్వులపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని ద్విసభ్య ధర్మాసనం స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కొన్ని షరతులతో జీవో 123ని యథాతథంగా అమలుపరిచేందుకు హైకోర్టు ఆమోదం తెలిపింది. భూసేకరణ కారణంగా నష్టపోయే ప్రభావిత కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించిన పది పాయింట్ల పాలసీని జీవో రూపంలో జారీచేయాలని ఆదేశించింది. భూసేకరణ చట్టంలోని షెడ్యూల్ 2లో పేర్కొన్న ప్రయోజనాల కంటే అధికంగా నిర్వాసితులకు ప్రయోజనాలు కల్పించాలని పేర్కొంది.ప్రభావిత కుటుంబాలకు ప్రయోజనాలపై ప్రభుత్వం జారీచేసిన జీవోను పరిశీలించిన తర్వాతే.. జీవో 123 ప్రకారం రైతుల నుంచి కొనుగోలు చేసిన భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తామని షరతు విధించింది. అప్పటివరకు భూములు రైతుల ఆధీనంలోనే ఉంచాలని, వ్యవసాయ పనులకు ఆటంకం కలిగించవద్దని పేర్కొంది. భూనిర్వాసితులు, ప్రభావిత కుటుంబాల సంక్షేమమే ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. మెదక్ జిల్లాలో 12600 ఎకరాల భూమిని నిమ్జ్ కోసం సేకరించే విషయంలో జీవో 123ను సవాల్ చేస్తూ వ్యవసాయ కార్మికులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన జస్టిస్ సురేశ్‌కుమార్ ఖైత్ ఆధ్వర్యంలోని సింగిల్ బెంచ్.. గతవారం జీవో 123ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆ ఉత్తర్వులపై ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేయగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ దుర్గాప్రసాదరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. గత శుక్రవారం విచారణ సందర్భంగా ప్రభావిత కుటుంబాలను ఆదుకునేందుకు పాలసీని సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభావిత కుటుంబాలను ఆదుకునేందుకు పది పాయింట్లతో రాష్ట్ర ప్రభుత్వం తన పాలసీని అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు సమర్పించింది. ప్రభుత్వం అందించిన పాలసీపై సంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. అభ్యంతరాలు ఉంటే తెలపాలని పిటిషనర్ల తరపు న్యాయవాదిని సోమవారం కోరింది. అయితే పిటిషనర్లతో సంప్రదించి అభిప్రాయం చెప్పడానికి ఆయన గడువు కోరడంతో విచారణను మంగళవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. మంగళవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. జీవో 123పై సింగిల్ బెంచ్ జారీచేసిన ఉత్తర్వులపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింద.