జురాలకు జలకళ
మహబూబ్‌నగర్,సెప్టెంబర్ 16,(జనంసాక్షి):జూరాలకు వరద పోటెత్తింది. ఎగువప్రాంతాల నుంచి లక్షా పన్నెండు వేల నాలుగొందల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 13 గేట్లు ఎత్తేశారు. అప్పర్ జూరాలలో ఐదు యూనిట్లు, లోయర్ జూరాల లో ఆరు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. వచ్చిననీరు వచ్చినట్లు కిందకు వదిలేస్తున్నారు. ఎగువన ఉన్న ఆల్మట్టి నుంచి నారాయణపూర్‌కు, నారాయణపూర్ నుంచి జూరాలకు వరద ప్రవాహం పెరుగుతున్నది. మహారాష్ట్రలోని భీమా నదిపై ఉన్న ఉజ్జయిని ప్రాజెక్టు నుంచి కూడా వరద నీరు భారీగా వస్తూ కృష్ణా నదిలో కలుస్తున్నది. ఈ నెలా మొదటి వారం నుంచి జూరాలకు వరద వచ్చి చేరుతుండడంతో, ఇంజినీరింత్ అధికారులు విద్యుత్ ఉత్పత్తిని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. తాజాగా శుక్రవారం ఉదయం జూరాలకు భారీగా వరద పెరిగింది. ఏడు గంటలకు 59 వేల క్యూసెక్కులు రావడంతో ఈ ఏడాది తొలిసారిగా ప్రాజెక్టు స్పిల్ వే గేట్లను ఎత్తారు. సాయంత్రం వర కు మూడు స్పిల్ వే గేట్లను ఎత్తి 14 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. అప్పర్, లోయర్ జల విద్యుత్ కేంద్రాల్లో 5 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉ త్పత్తిని కొనసాగిస్తున్నారు. మరోవైపు యంజికెఎల్‌ఐ పథకంలో భాగంగా కల్వకుర్తి ప్రాంతానికి సాగు నీరందించే 29వ ప్యాకేజీ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరో రెండు వారాల్లో కల్వకుర్తి మండలం జంగారెడ్డి పల్లి వరకు కృష్ణా నీళ్లు రానున్నాయి. ఈ నేపథ్యంలో కెనాల్ పనులను ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి పరిశీలించారు.ఇన్నిరోజులు వట్టిపోయిన కృష్ణానది ఇపుడు వరదనీటితో కళకళలాడుతోంది. ఎగువన కురుస్తున్నవర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి శనివారం వరదనీరు పోటెత్తింది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, రోజ గేజింగ్ కేంద్రాల నుంచి వరదనీరు వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 836.40 అడుగులు, నీటి సామర్థ్యం 56.7890 టీఎంసీలుగా ఉంది. హంద్రీనీవాకు వేయి క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణాబేసిన్ ఉన్న ప్రాజెక్టుల్లో నీరు క్రమంగా నిండుతోంది. కర్నాటక నుంచి వస్తున్నప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. వరద కంటన్యూ అవుతూ ఉండడంతో.. మూడుగేట్లు ఒకవిూటరు చొప్పున ఎత్తి స్పిల్ వే ద్వారా.. 38 వేల క్యూసెక్కులు,? పవర్ హౌస్ ద్వారా 40వేల క్యూసెక్కులు కిందికి వదులుతున్నారు. ఈ మొత్తం వరద ఇపుడు శ్రీశైలం వైపు పరుగులు తీస్తోంది మరోవైపు సుంకేశుల బ్యారేజీ దగ్గర కూడా భారీగా వరద వస్తోంది. బ్యారేజీ పూర్తిస్థాయికి నీరు చేరుకోవడంతో.. లక్షా 19 వేల 330 క్యూసెక్కులు దిగువకు వదిలారు. జూరాలనుంచి 84వేల క్యూసెక్కులు, సంకేశుల నుంచి లక్షా 19వేల క్యూసెక్కులు మొత్తం లక్షా 96వేల క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలం జలాశయంలోకి వస్తోంది. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం కూడా పెరుగుతోంది.శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 56 టీఎంసీలు మాత్రమే ఉంది. ఇదే వరద కంటిన్యూ అయితే మరో వారం పదిరోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండే అవకాశం ఉందంటున్నారు ప్రాజెక్టు ఇంజినీర్లు, ఇక భారీగా వస్తున్న వరదతో ప్రాజెక్టులకు జలకళ రావడంపై రైతులు కూడా ఆనందంగా ఉన్నారు.