జురాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు
జూరాల,జులై 22(జనంసాక్షి): భీమా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో శుక్రవారం సాయంత్రం జూరాల రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు చేరుతోంది. బుధ, గురువారాల్లోనూ వరద కొనసాగిన విషయం విధితమే. దీంతో ప్రాజెక్టు విద్యుదుత్పత్తి కేంద్రంలో నాలుగు టర్బైన్ల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. 32వేల క్యూసెక్కుల నీటికి దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్‌కు ఎగువ నుంచి 65వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో శుక్రవారం రాత్రి 7.30గంటలకు వచ్చి చేరనుంది. పూర్తిస్థాయి నీటినిల్వ అనంతరం గేట్లు తెరవనున్నారు. కుడి కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 500 క్యూసెక్కులు, సమాంతర కాలువ ద్వారా 1200 క్యూసెక్కులు, నెట్టెంపాడు ఎత్తిపోతలకు 1500 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతలకు 630 క్యూసెక్కులు ఇలా మొత్తం 36,430 క్యూసెక్కులను వినియోగిస్తున్నారు. అదనంగా వస్తున్న వరద నీటిని క్రస్టుగేట్ల ద్వారా నదిలోకి విడుదల చేయనున్నారు. నదిలోకి వదిలిన నీరు శ్రీశైలం రిజర్వాయర్‌కు వెళ్తుంది.
ఆల్మట్టిలో 126 టీఎంసీల నిల్వ..
ఆల్మట్టి ప్రాజెక్టు రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా 126.34 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. ఎగువ నుంచి 29,760 క్యూసెక్కుల వరద వస్తోంది. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటినిల్వ 36.74 టీఎంసీలుగా నిర్వహిస్తున్నారు. పై నుంచి ఇన్‌ఫ్లో 9200 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. తుంగభద్ర ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 100.86 టీఎంసీలు కాగా ప్రస్తుతం 40.39 టీఎంసీలకు నీటినిల్వ చేరింది. ఇన్‌ఫ్లో కేవలం 4982 క్యూసెక్కులు వస్తుండగా తాగునీటి అవసరాలకు 1334 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. జలవిద్యుత్ కేంద్రంలో 39 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఆరు టర్బైన్లలో రెండు టర్బైన్లు సాంకేతిక సమస్యతో పనిచేయడం లేదు.