జూన్ 6న చీకటి రోజు
ఇల్లెందు (సింగరేణి): సింగరేణి వ్యాప్తంగా జూన్ 6న కార్మికులంతా చీకటి రోజు (బ్లాక్‌డే)గా పాటించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ ఉపాధ్యక్షుడు గడ్డం వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. ఇల్లెందులోని సంఘం కార్యాలయంలో మంగళవార ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వారసత్వ ఉద్యోగాలు పోగొట్టిన జాతీయ సంఘాల తీరును నిరసిస్తూ సింగరేణి బొగ్గుగనుల్లో నల్ల బ్యాడ్జిలు ధరించి కార్మికులు నిరసన తెలపాలని కోరారు. కార్మికుల హక్కుగా ఉన్న వారసత్వ ఉద్యోగాలను పొగొట్టిన జాతీయ సంఘాలు గుర్తింపు సంఘం ఎన్నికలలో తామే వారసత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని పేర్కొనటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఒప్పందంపై సంతకాలు చేసిన ప్రతులను గనుల్లో దహనం చేయాలని కోరారు. కార్మికుల అలవెన్సులను పోగొట్టటంలో జాతీయ సంఘాలుగా చెప్పుకునే ఏఐటీయూసీ. ఐఎన్‌టీయూసీ ప్రధాన పాత్ర వహించాయని అన్నారు. తెలంగాణ సాధన, కార్మికుల సంక్షేమం, సింగరేణి మనుగడకు పాటుపడే తెబొగకాసంకు కార్మికులు మద్దతు ఇవ్వాలని కార్మికులను ఆయన కోరారు. సమావేశంలో నాయకులు ఆరుట్ల మాధవరెడ్డి, దండు వెంకటస్వామి, వీపూరి రాములు, శంకర్, సుదర్శన్, కృష్ణ, సత్యం పాల్గొన్నారు.