జూరాలకు తగ్గిన నీరు
గద్వాల,జూలై2(జనం సాక్షి): జూరాల ప్రాజెక్టుకు వస్తున్న వరద పూర్తిగా తగ్గుముఖం పట్టినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్‌కు వరద భారీగా పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు తుంగ నది నుంచి భారీగా వరద నీరు డ్యాంలోకి వచ్చి చేరుతోంది. కర్ణాటక, ఏపీ రాష్ట్రాల పరిధిలో కురుస్తున్న వర్షాలకు ఆర్డీఎస్ ఆనకట్టలో వరద నీరు అడుగున్నర మేరకు నిల్వ ఉన్నట్లు డీఈఈ రామయ్య తెలిపారు. ఎగువ నుంచి స్వల్పంగా వరద ఆనకట్టకు చేరుకోగా, దిగువన ఉన్న సుంకేసుల జలాశయానికి చేరుతోందని డీఈ పేర్కొన్నారు.ఆదివారం తుంగ ప్రాజెక్టు నుంచి 49,424 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. స్వల్ప ఇన్‌ఫ్లో నమోదు కాగా, జలాశయంలో నీరు చేరింది. తాగు నీటి అవరసరాల నిమిత్తం జూరాల కుడి కాలువకు 55 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 161 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఆల్మట్టికి రెండ్రోజులుగా వరద ఉధృతి కొనసాగుతున్నది. నారాయణపూర్‌లోకి ఎలాంటి ఇన్‌ఫ్లో నమోదు కాలేదని అధికారులు తెలిపారు.