జూరాలకు తగ్గిన వరద ఉధృతి
జూరాల గేట్లు మూసివేసిన అధికారులు
మహబూబ్‌నగర్,ఆగస్ట్7(జనంసాక్షి): కృష్ణా నదిలో వరద ఉధృతి తగ్గింది. అలాగే ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్ట్ నుంచి వరద తగ్గుముఖం పట్టింది. దీంతో జూరాల ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం 50,900 క్యూసెక్కుల ఇన్‌ప్లో వస్తుండగా.. విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 37,237
క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 317.940 విూటర్లు కాగా.. ప్రస్తుతం 318.516 విూటర్లకు చేరుకున్నది. ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.493 టీఎంసీలకు చేరుకున్నది. ఎగువ నుంచి వచ్చే వరదను బట్టి నీటి విడుదల కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 50 వేల క్యూసెక్కుల వరద కొనసాగుతున్న తరుణంలో విద్యుత్ ఉత్పత్తి మాత్రం కొనసాగుతుందని పేర్కొన్నారు. కృష్ణా నదితో పాటు పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో గత 15 రోజులుగా భారీ వరద కొనసాగింది. గరిష్ఠంగా జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి సుమారు ఐదు లక్షల వరకు క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే భారీ వరదతో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి.