జైలుశిక్షపడ్డా వెరవొద్దు
` దేనికైనా సిద్ధంకండి
` కార్యకర్తలతో కేజ్రీవాల్
దిల్లీ(జనంసాక్షి): ప్రజా శేయస్సు కోసం తాము ఎంచుకున్న మార్గంలో జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉండాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములుగా చేయడంతో తమ పార్టీ ప్రజాదరణ పొందిందని కేజ్రీవాల్ అన్నారు. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న పార్టీ నేతలను చూసి గర్వంగా ఉందన్నారు. ‘’పిల్లలకు ఉన్నతమైన విద్య, పేదలకు ఉచిత వైద్యం గురించి మాట్లాడితే మనం జైలుకు వెళ్లాల్సిందే. అందుకు మనం సిద్ధంగా ఉండాలి. మనం సమస్యలను ఎదుర్కొంటున్నామని భావిస్తున్నా. కానీ, అందుకు బాధపడనవసరం లేదు. ఈ రోజు జైలులో ఉన్న మన నేతలే మన హీరోలు. వారందరినీ చూసి చాలా గర్వపడుతున్నా’’ అని అన్నారు.కేంద్రంలోని భాజపా దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని తమ పార్టీ నేతలను జైలుకు పంపిందని ఆరోపిస్తూ ఆయన పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ఏ ఇతర పార్టీలు దృష్టి సారించని సమస్యలపై తమ పార్టీ దృష్టి కేంద్రీకరించిందని అన్నారు. దేశంలో మొదటిసారి ప్రజలకు తమ పార్టీ ప్రత్యామ్నాయంగా మారిందన్నారు. ఇలాంటి రాజకీయాలను ప్రజలు ఇష్టపడడం ప్రారంభించారన్నారు.