జొకోవిచ్కు మరో వాకోవర్

9988న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన వరల్డ్ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్కు మరో వాకోవర్ లభించింది.  గత రెండో రౌండ్ మ్యాచ్లో కనీసం రాకెట్ పట్టకుండానే మూడో రౌండ్కు చేరిన జొకోవిచ్.. తాజా పోరులో ప్రత్యర్థి మైఖేల్ యోజ్నీ (రష్యా)కు తొడ కండరాలు పట్టేయడంతో మ్యాచ్ మధ్య నుంచి అర్థాంతరంగా వైదొలిగాడు. తొలి సెట్లో జొకోవిచ్ 4-2 తో ఆధిక్యంలో ఉన్న దశలో యోజ్నీ పోరు నుంచి తప్పుకున్నాడు.  దీంతో జొకోవిచ్ పూర్తిగా మ్యాచ్ ఆడకుండానే ప్రి క్వార్టర్స్ లోకి ప్రవేశించాడు.

అంతకుముందు  పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో అతని ప్రత్యర్థి జిరి వెసెలి (చెక్ రిపబ్లిక్) నుంచి టాప్‌సీడ్ సెర్బియన్ స్టార్‌కు వాకోవర్ లభించిన సంగతి తెలిసిందే. గాయం కారణంగా జిరి వెసిలి మ్యాచ్ ఆడకుండానే నిష్క్రమించడంతో జొకోవిచ్ వాకోవర్ ద్వారా మూడో రౌండ్లోకి  ప్రవేశించాడు. అయితే వరుస వాకోవర్లపై జొకోవిచ్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు. తన గ్రాండ్ స్లామ్ కెరీర్లోనే ఎప్పుడూ ఇలా వాకోవర్ల ద్వారా తదుపరి రౌండ్లకు చేరడం జరగలేదని స్పష్టం చేశాడు. ప్రత్యేకంగా ఈ సీజన్లో రెండో వాకోవర్ రావడంతో కనీసం మ్యాచ్ ప్లే ఆడే అవకాశాన్ని కోల్పోతున్నానంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు.