జోన్ల వ్యవస్థ తొందరపాటు నిర్ణయం

– జోన్ల వ్యవస్థపై అధికారుల నివేదికను బహిర్గతం చేయాలి
– పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి
– రాష్ట్ర వ్యాప్తంగా టీజేఎస్‌ను బలోపేతం చేస్తాం
– స్థానిక ఎన్నికల్లో పోటీకి 1300మంది రిజిస్టేష్రన్‌ చేసుకున్నారు
– వారికి 27న శిక్షణా తరగతులు నిర్వహిస్తాం
– టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం
సంగారెడ్డి, మే25(జ‌నంసాక్షి) : రాష్ట్రంలో జోన్ల వ్యవస్థ తొందరపాట నిర్ణయమని, ప్రభుత్వం అనాలోచితంగా అలోచించి జోన్ల వ్యవస్థను తీసుకువచ్చిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. జోన్ల వ్యవస్థపై అధికారుల నివేదికను బహిర్గతం చేయాలని కోదండరాం డిమాండ్‌ చేశారు. సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలో శుక్రవారం అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కోదండరాం.. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండరాం సమక్షంలో పలువురు తెలంగాణ జన సమితి పార్టీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా టీజేఎస్‌ పార్టీని బలోపేతం చేస్తామని, రానున్న సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. విపరీతంగా పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను నియంత్రించి జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లో టీజేఎస్‌ అభ్యర్థులు బరిలో ఉంటారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులను ఆన్‌లైన్‌ రిజిస్టేష్రన్‌ ద్వారా ఆహ్వానిస్తున్నామని.. ఇప్పటివరకు సుమారు 1300మంది రిజిస్టేష్రన్‌ చేసుకున్నారని కోదండరాం తెలిపారు. వీరందరికి ఈనెల 27న హైదరాబాద్‌లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పన్ను వసూలు చేస్తున్నందున సరుకు రవాణా చేసే వాహనదారులు పక్క రాష్ట్రాల్లోనే పెట్రోల్‌, డీజిల్‌ పోయించుకుంటున్నారని.. దీని ద్వారా తీవ్ర నష్టం వాటిల్లుతోందని అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను నియంత్రించకపోవడంతో నిత్యవసర వస్తువుల ధరలకు రెక్కలు వచ్చాయని.. దీనిపై ప్రభుత్వాలు వెంటనే దృష్టి సారించాలన్నారు. రాబోయే రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని, తద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని కోదండరాం తెలిపారు. ఈకార్యక్రమంలో టీజేఎస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.