జోరుగా మిషన్ భగీరథ పనులు
సిద్దిపేట,జూన్26(జనం సాక్షి): గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారంకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పనులు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. గోదావరి నుండి పైప్‌లైన్ల ద్వారా ప్రతి గ్రామానికి నీరందిచేందుకు గానూ ప్రతి రోజు పనులు శరవేగంగా సాగుతున్నాయి. దీంతో మరికొన్ని నెల్లలో పనులు మొత్తం పూర్తి చేసి మండలాల్లోని ప్రజలకు తాగు నీరందించనున్నారు. ఇదీ పూర్తి చేసినట్లయితే ప్రజలకు దాహర్తి తీరనుంది. అలాగే మంజీరా నదినుంచి కూడా మిషన్ భగీరథ పథకానికి ఆయా ప్రాంతాలకు నీరు సరఫరా చేస్తారు. ఇంతకాలంతాగడానికి గుక్కెడు నీళ్లు లేక ఇక్కడి గ్రామాల్లోని ప్రజలు ఇంతకాలం ఎన్నో బాధలు పడ్డారు. ఎండా కాలంలో అయితే వీరి బాధలు వర్ణనాతీతం. ఎర్రటి ఎండలు లెక్కచేయాకుండ కిలో విూటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి వ్యవసాయ బోర్లనుండి నీటిని తెచ్చుకునేవారు. కానీ ప్రస్తుతం మిషన్‌భగీరథ పనులు జోరుగా సాగుతూ త్వరలో ఇంటింటికీ నల్లా నీళ్లు రానున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రసుత్తం మండలంలో ఎక్కడ చూసిన మిషన్‌భగీరథ పనులు ఊపందుకున్నాయి. భారీ పైపులను తీసుకు వస్తూ క్రేన్ల సహాయంతో నీటి సరఫరా కోసం తీసిన గుంతలో పైపులను ఏర్పాటు చేస్తున్నారు. పైపులను వేసిన వెంటనే ప్రజల రాకపోకలకు ఏలాంటి ఇబ్బంది రాకుండా గుంతలను వెంటనే పుడ్చివేస్తున్నారు. పనులు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటు న్నారు. మంత్రి హరీష్ రావు కూడా ఎప్పటికప్పుడు పనులను ఆరా తీస్తుఊ సూచనలు ఇస్తున్నారు.



