జ్వరాలు రాకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి
అన్ని జ్వరాలను డెంగ్యూగా నిర్ధారించలేం
ఆస్పత్రుల్లో సిబ్బంది, మందులు సిద్దం
మంచిర్యాల,ఆగస్ట్12(జనం సాక్షి): జిల్లాలో డెంగ్యూ, మలేరియా జ్వరాలు విస్తరిస్తున్నాయి. గతంలో మాదిరి డెంగ్యూ ప్రభావం అంతగా లేకున్నా, జిల్లాలో కేసులు నమోదవు తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లా వ్యాప్తంగా డెంగ్యూతో ఈ సీజన్‌లో ఇప్పటికే 10 మంది మరణాలు సంభవించిన దాఖలాలు ఉండగా, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం డెంగ్యూ మరణాలు నమోదు కాలేదని పేర్కొంటున్నారు. జిల్లాలో జ్వరాలు విజృంభిస్తుండటంతో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అన్ని ఆస్పత్రుల్లో అవసరమైన మందులు, సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. సిబ్బంది ఫీవర్ సర్వేలో భాగంగా ఇంటింటికి వెళ్లి పరీక్షలు చేస్తున్నారు.సీజనల్ వ్యాధులు సోకకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నామని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖఅధికారి డా. సుబ్బారాయుడు చెప్పారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారికి మలేరియా, డెంగ్యూ, టీబీ టెస్టులు కూడా చేస్తున్నాం. పాజిటివ్ కేసులు ఉన్నచోట పీహెచ్‌సీల పరిధిలో తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. కరోనా నేపథ్యంలో టెస్టుల సంఖ్య కూడా గణనీయంగా పెంచామన్నారు. జిల్లాలో డెంగ్యూ కేసులు అక్కడక్కడ నమోదవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు మరణాలు సంభవించలేదన్నారు. ఎలీసా టెస్టులో పాజిటివ్‌గా వస్తేనే డెంగ్యూగా భావించాలి. అంతేగానీ కేవలం రక్తకణాలు తగ్గితేనే వ్యాధిగా నిర్దారించ కూడదని అంటూ, అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బంది, మందులను అందుబాటులో ఉంచామని అన్నారు. ఇదిలా ఉండగా జ్వరాల కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు బాధితులతో కిటకిటలాడుతున్నాయి. కొవిడ్ సమయం కావడంతో అధిక సంఖ్యలో జ్వర పీడితులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఓ వైపు సీజనల్ వ్యాధులు, మరో వైపు మలేరియా, డెంగ్యూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పారిశుధ్య లోపం కారణంగా కాలనీలు, ప్లలెల్లో వ్యాధులతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. మలేరియా, డెంగ్యూ జ్వరాలు విస్తరిస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కొవిడ్ సమయంలో సీజనల్ వ్యాధులు సోకడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. జ్వరం వచ్చిందంటే అది ఏ రకానికి చెందినదో తెలియక భయపడుతున్నారు. ముఖ్యంగా మురికి వాడల్లో నివ సించే ప్రజలు అధిక సంఖ్యలో జ్వరాల బారిన పడుతున్నారు. వాతావరణంలో మార్పులు వచ్చినందున ప్రజలు విధిగా పరిసరాల పరిశుభ్రత పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.