టాస్క్‌ఫోర్సు గట్టి చర్యలతో అడవులకు రక్షణ
తిరుపతి,జూన్4(జనం సాక్షి): శేషాచలంలో లభించే అరుదైన ఎర్రచందనానికి విదేశాల్లో గిరాకీ ఎక్కువగా ఉండడంతో స్మగ్లర్లు దీనిపై కన్నేయడంతో అడవులను కాపాడేందుకు ఎపి ప్రభుత్వం కఠిన చర్యలు అవలంబించడంతో అవి సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇటీవల మళ్లీ వరు దాడుల కారణంగా దొంగలు అడవుల్లోకి రావడానికి జంకుతున్నారు. అడపదడపా వస్తున్నా గట్టిగా ప్రతిఘటించండంతో తోక మడుస్తున్నారు. గతంలో శేషాచల అడవుల నుంచి ఎర్రచందనాన్ని అక్రమగా తరలిస్తూ కోట్లాది రూపాయల అటవీసంపదను కొల్లగొట్టారు.శేషాచలం కొండల్లో మాత్రమే లభ్యమయ్యే అరుదైన ఎర్రచందనం చెట్లను స్మగ్లర్ల దాడిని నుంచి రక్షించేందుకు ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ చురకుగా పనిచేయడంతో స్మగ్లింగ్‌తగ్గడంతో పాటు అడవుల నరికివేత ఆగిపోయింది. అక్రమ రవాణాను నిలువరించడంలో విజయం సాధించారు. పూర్తిస్థాయి నివారణకు ప్రణాళికలు రచిస్తున్నట్లు టాస్క్‌ఫోర్సు డిఐజి కాంతారావు తెలిపారు. నిరంతరం కూబింగ్‌లు, అరెస్టులు, దాడులు, కేసులు తదితర వాటితో కొంత అక్రమ రవాణా తగ్గుముఖంపట్టింది. 2015 ఏప్రిల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 22 మంది ఎర్రచందనం కూలీలు మృతి చెందారు. దీంతో కూలీల్లో కొంత భయాందోళనలు మొదలు కావడంతో అక్రమ రవాణాకు వచ్చే వారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. అక్రమ రవాణా తీవ్రస్థాయికి చేరుకోవడంతో శేషాచలంలో లభించే అరుదైన ఎర్రచందనం కనుమరుగయ్యే ప్రమాదం ఉండడంతో దాన్ని కాపాడేందుకు సిఎం చంద్రబాబు ఆదేశాలతో అటు పోలీసులు, ఇటు ఫారెస్టు అధికారులు గట్టి చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు తరవాత అడవుల్లో గట్టి నిఘా ఏర్పడింది. టాస్క్‌ఫోర్సుకు డిఐజి స్థాయి అధికారిని నియమించి ఫారెస్టు, పోలీసు విభాగం సమన్వయంతో కూబింగ్‌లు నిర్వహించారు. అప్పటి నుంచి స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. దీంతో గతంలో తీవ్రస్థాయిలో ఉన్న స్మగ్లింగ్ ఎన్‌కౌంటర్‌తో ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. ఇందులో రెవెన్యూ, పోలీసు విభాగం, ఫారెస్టు, టాస్క్‌ఫోర్సు అధికారులు, సిబ్బంది కీలకపాత్ర పోషించారు. 15 వేల హెక్టార్ల శేషాచలం ఫారెస్టులో 8 డివిజన్లకు కలుపుకుని కేవలం 350 మంది అధికారులు, సిబ్బంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. అడవుల్లో, లోయల్లో, ఎత్తైన కొండల్లో కూబింగ్‌చేసి స్మగ్లర్లకు ధీటుగా తిరేగేందుకు ఇబ్బంది పడుతున్నారు. అవసరమైన ఆయుధాలు ఇస్తే మిగిలిన అక్రమ రవాణాను కూడా సులభంగా అరికడతామని ఫారెస్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు. త్వరలో సిసి కెమెరాలను శేషాచలం నుంచి వెలుపలకు వెళ్లే అన్ని మార్గాల్లో అమర్చుతామని, ఈవోటీఎస్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి, సాంకేతిక నైపుణ్యతను వినియోగించుకుంటామని ఫారెస్టు, టాస్క్‌ఫోర్సు అధికారులు తెలియజేశారు. జాతీయ సంపదను కాపాడాలని ప్రతి ఒక్కరూ భావించి సహకరిస్తే పూర్తి స్థాయిలో అక్రమ రవాణాను అరికడతామన్నారు. పోలీసు, రెవెన్యూ, ఫారెస్టు, తదితర శాఖల్లో ఉన్న ఇంటి దొంగలను పసిగట్టి వారిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించనున్నట్లు వెల్లడించారు.