టిఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పనున్న రాథోడ్‌?

నేడు ఉత్తమ్‌ సమక్షంలో కాంగ్రెస్‌లోకి

వరంగల్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌ కాంగ్రెస్‌లో చేరడం ఖాయంగా మారింది. ఆమె తన అనుచరులతో ఈ నెల 24న కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోవడం కాయమని తెలుస్తోంది. ఇప్పటికే పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌తో చర్చించి డోర్నకల్‌ టిక్కెట్‌ ఖరారు చేసుకున్నట్లు సమాచారం. గత కొన్ని రోజుల కిందట ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెరాస అభ్యర్థులను ప్రకటించడంతో డోర్నకల్‌ నియోజకవర్గం నుంచి సత్యవతిరాథోడ్‌కు టికెట్‌ రాకపోవడంతో నిరాశ చెందిన నర్సింహులపేట, దంతాలపల్లి మండలాల నాయకులు, కార్యకర్తలు రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకొని గ్రామాల వారీగా, సలహాలు, సూచనలు తెలుసుకొని చర్చించుకొని కార్యకర్తల అభిష్ఠం మేరకు కాంగ్రెస్‌లో చేరాలనే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.తెరాస జిల్లా నాయకుడు, మాజీ సర్పంచి కొమ్మినేని రవీందర్‌తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. రెండు మండలాలకు చెందిన 13మంది మాజీ సర్పంచులు, 5గురు మాజీ ఎంపీటీసీ సభ్యులు, 5గురు సింగిల్‌విండో డైరెక్టర్లతో పాటు 500మంది అనుచరులతో మంగళవారం తెరాస పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి 24న హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో పీసీసీ ఛీప్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు అసమ్మతి వర్గానికి చెందిన నాయకులు చర్చించుకుంటున్నారు. తదనంతరం పీసీసీ ఛీఫ్‌, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డిని నర్సింహులపేటకు తీసుకువచ్చి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రెండు మండలాల్లో 5000 మందిని కాంగ్రెస్‌లో చేర్పించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.