టిఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు

కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో బిజెపి,మహాకూటమి ఖాళీ కావడం తథ్యం అన్న మంత్రి

నల్గొండ,నవంబర్‌13(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీష్‌ రెడ్డి సమక్షంలో ప్రముఖ వైద్యుడు రామ్మూర్తి దంపతులు, టీడీపీ కౌన్సిలర్‌ నిమ్మల వెంకన్నతో సహా 2 వేల మంది అనుచరులు టీఆర్‌ఎస్‌లోకి చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో మూసీనీటిని తాగే దుస్థితి నుంచి తప్పించి ప్రజలకు కృష్ణాజలాలను తీసుకువచ్చానని చెప్పారు. సద్దుల చెరువును టాంక్‌బండ్‌గా మార్చానని తెలిపారు. త్వరలోనే పుల్లా రెడ్డి చెరువు ను కూడా ట్యాంక్‌ బండ్‌ గా తీర్చి దిద్దబోతున్నామని తెలియజేశారు. సూర్యాపేటకు మంజూరు అయిన మెడికల్‌ కాలేజ్‌ పూర్తయితే.. జిల్లా రూపురేఖలే మారతాయని అన్నారు. 2004 నుండి 2014 వరకు జిల్లాలో అభివృద్ది జరగలేదని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో సూర్యాపేటను ప్రపంచంలోనే మోడల్‌ నియోజక వర్గముగా తీర్చి దిద్దుతానని మంత్రి జగదీష్‌ రెడ్డి తెలిపారు. ఉస్మానియా విద్యార్థులపై మొసలి కన్నీరు కార్చిన కాంగ్రెస్‌ ఇప్పుడు మళ్లీ వారిని మోసగిస్తున్నదని అన్నారు. ఉద్యమకారులను సముచితంగా గౌరవిస్తున్నది టీఆర్‌ఎస్‌ మాత్రమేనని, ఉద్యోగ సంఘాల ఉద్యమనేత స్వామిగౌడ్‌కు శాసనమండలి చైర్మన్‌గా, విదార్థి సంఘాల నేత బాల్క సుమన్‌కు ఎంపీగా, గాదరి కిశోర్‌కు ఎమ్మెల్యేగా, డాక్టర్ల జేఏసీ చైర్మన్‌ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌, ప్రొఫెసర్ల తరఫున పోరాడిన సీతారాంనాయక్‌కు లోక్‌సభ సభ్యులుగా టీఆర్‌ఎస్‌ అవకాశమిచ్చిందని తెలిపారు. తెలంగాణకు పరాయిపాలన వద్దని, అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వంద సీట్లకుపైగా గెలువడం, కేంద్రంలోనూ చక్రం తిప్పడం ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీజేఎస్‌ పూర్తిగా ఖాళీ అవుతాయని చెప్పారు. మహాకూటమికి డిపాజిట్లు కూడా దక్కకుండా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు శ్రమించాలని పిలుపునిచ్చారు.

 

 

తాజావార్తలు