టిఆర్‌ఎస్‌వి రైతు వ్యతిరేక విధానాలు
మండిపడ్డ మాజీమంత్రి షబ్బీర్ అలీ
కామారెడ్డి,జూన్10(జనంసాక్షి): రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి భవిష్యత్‌లో తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ నాయకులు ,మాజీమంత్రి షబ్బీర్ అలీ పిలుపు నిచ్చారు. భూసమస్యల పరిష్కారానికి చేసే పోరాటంలో రైతుల పక్షాన అండగా ఉంటామని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా పేదలకు ఇచ్చిన భూములను ఈ ప్రభుత్వం లాక్కుని.. రైతులను తీవ్రంగా నష్టపరిచిందని అన్నారు. తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయనుకున్న రైతులు చివరకు భంగ పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అనాదిగా భూములను నమ్ముకున్న రైతులకు పట్టాలు ఇవ్వకుండా వాటిని హరితహారం పేరుతో లాక్కొని మోసం చేశారని, పేదలకు పంచిన భూములను గుంజుకొని ఈ పాలకులు, టీఆర్‌ఎస్ నాయకులు రియల్‌ఎస్టేట్ వ్యాపారం దందా సాగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన ధరణి పోర్టల్‌తో రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేస్తామన్నారు. 40 ఏళ్ల కింద భూములు అమ్ముకున్నా వారికి ఈ ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది కానీ సాగులో ఉన్న రైతులకు పట్టాలు ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్‌ఎస్ మాయమాటలను ప్రజలు నమ్మి మోసపోవద్దని కోరారు. రాష్ట్రంలో ఇప్పటికైనా టీఆర్‌ఎస్ అరాచక పాలనను స్వస్తి పలకాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతును రాజులా చేస్తే టీఆర్‌ఎస్ ప్రభుత్వం బిచ్చగాళ్లులా మార్చిందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజేక్టు పేరుతో కేసీఆర్ ప్రభుత్వం రూ.కోట్లు దండుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీఆర్‌ఎస్ ప్రభుత్వం గుంజుకునక్న భూములను తిరిగి పంపిణీ చేయడంతో పాటు పట్టా హక్కులు కల్పిస్తామన్నారు.