టిప్పుసుల్తాన్ జయంతి వేడుకలపై మతోన్మాదుల దాడి
– ఒకరి మృతి
బెంగుళూరు,నవంబర్ 11,(జనంసాక్షి): కర్ణాటకలో స్వతంత్య్ర సమరయోధరాజు టిప్పు సుల్తాన్ జయంతిని కర్ణాటక సర్కారు అధికారికంగా నిర్వహించింది. ఈ వేడుకలపై మతోన్మాద శక్తులు దాడి చేసి వీరంగం సృష్టించాయి.
డికెరిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఉత్సవాలను వ్యతిరేకిస్తూ వీహెచ్‌పీ, హిందూసేన ఆదోళనలు చేపట్టాయి. వీహెచ్‌పీ, హిందూసేన కార్యకర్తపై రాళ్ల దాడిలో ఒకరు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనతో రంగంలోకి దిగిన పోలీసులు దొరికినవారిని దొరికినట్టు చితకబాదారు. టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సుల్తాన్ జయంతి వేడుకలను హిందూసేన, వీహెచ్‌పీ కార్యకర్తలు వ్యతిరేకించారు. మడికెరిలో నిర్వహించిన టిప్పు జయంతి వేడుకలను వీహెచ్‌పీ, హిందూసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. నిరసన వ్యక్తం చేస్తూ భారీ ర్యాలీ తీశారు. టిప్పు కన్నడ వ్యతిరేకి అని నినదించారు. కన్నడ వ్యతిరేకి అయిన టిప్పు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సరికాదన్నారు. ర్యాలీ తీసిన హిందూసేన, వీహెచ్‌పీ నేతలు, ఘర్షణలో వీహెచ్‌పీ నేత కట్టప్ప(50) మృతి చెందాడు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాళ్ల దాడిలో వీహెచ్‌పి కార్యకర్త తీవ్రంగా గాయపడగా తొలుతు అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మరణించాడు. స్థానికంగా ఇరువర్గాల వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులను మొహరించారు. మడికెరి ప్రధాన రహదారిపై జరిగిన ఈ ఘటన ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో టిప్పు అభిమానులు, హిందూసేన, వీహెచ్‌పీ కార్యకర్తలపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. పోలీసులు లాఠీలతో గొడ్లను బాదినట్లు బాదారు. దీంతో ఆందోళనకారులు పరుగులు పెట్టారు. పోలీసులు తీరుపై ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. 18వ శతాబ్దానికి చెందిన టిప్పు సుల్తాన్ మైసూర్ సామ్రాజ్యాన్ని పాలించారు. ఈ సమయంలో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో టిప్పుకు వైరం ఉండేది. ఈ నేపథ్యంలో 1799లో శ్రీరంగపట్నం కోటను రక్షించుకునే క్రమంలో బ్రిటీష్ బలగాలతో పోరాడి టిప్పు ప్రాణాలొదిలాడు.