టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే దమ్ము బీజేపీకే ఉంది

– కేసీఆర్‌కు చిత్తశుద్ది ఉంటే మహిపాల్‌రెడ్డినితో రాజీనామా చేయించాలి
– టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, లెఫ్ట్‌, ఎంఐఎంలు ఒక్కటైనా ఆశ్చర్యం లేదు
– బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది
– జనచైతన్య యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌
సంగారెడ్డి, జూన్‌29(జనం సాక్షి ) : టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే దమ్ము బీజేపీకే ఉందని బీజేపీ నేత లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. ఆపార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జనచైతన్య యాత్ర శుక్రవారం సంగారెడ్డి జిల్లాలో సాగింది. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. ప్రధాని మోదీని చూసి అన్ని పార్టీలు భయపడుతున్నాయని అన్నారు. కాంగ్రెస్‌ పరిస్థితి చుక్కాని లేని నావాలా తయారైందని ఎద్దేవాచేశారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, లెఫ్ట్‌, ఎంఐఎం ఒక్కటైనా ఆశ్చర్యం లేదని లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిని కోర్టు అనర్హుడిగా ప్రకటించిందన్న లక్ష్మణ్‌, ఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే మహిపాల్‌రెడ్డితో రాజీనామా చేయించాలని, తద్వారా వెంటనే ఉప ఎన్నికలకు రావాలని లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణకు అడుగడుగునా అడ్డుపడ్డ మజ్లిస్‌ పార్టీ ఇప్పుడు మా దోస్తులంటున్నారు. ఎలా అయ్యారో చెప్పాలని కేసీఆర్‌ను ప్రశ్నించారు. కేసీఆర్‌ ముందుస్తు ఎన్నికలు అంటున్నారని, అందుకు బీజేపీకి సిద్ధంగా ఉందని లక్ష్మారావు పేర్కొన్నారు. మా బస్సు యాత్రను చూసి బీజేపీ బస్సు యాత్రను చేపట్టిందని చెప్పడం కాంగ్రెస్‌ నేతల అజ్ఞానమన్నారు. 60 సంవత్సరాలుగా కాంగ్రెస్‌ పార్టీ పాలనలో ఎమర్జెన్సీ లాంటి చీకటి రోజులు తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దే అన్నారు. ఎన్డీయే హయాంలో దేశం సుభిక్షంగా ఉందని, దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో వివిధ పార్టీల పాలనలో విసిగిపోయిన ప్రజలు ఈ దఫా భాజపాకు అవకాశం ఇవ్వాలని లక్ష్మణ్‌ పిలుపునిచ్చారు.