టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్!
-ప్రకటనే తరువాయి
హైదరాబాద్,ఏప్రిల్ 20 (జనంసాక్షి): టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎన్నిక మరోసారి ఏకగ్రీవమే కానుంది. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి ఆయన ఒక్కడి పేరునే ఆరు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. . టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు సోమవారం మధ్యాహ్నం నామినేషన్ల గడువు ముగిసింది. ఉదయం 10 గంటలకు అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. కేసీఆర్ తరఫున మంత్రులు, ముఖ్య నేతలు ఆరు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇతరులెవరూ నామినేషన్లు దాఖలు చేసే అవకాశం లేనందున కేసీఆరే మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నిక కానున్నారు. ఈ సందర్భంగా ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌ను ప్రతిపాదిస్తూ ఇప్పటి వరకు 6 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. పార్టీ అధ్యక్ష పదవికి కేసీఆర్ మినహా ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం కడియం కేసీఆర్‌ను అధ్యక్షుడిగా ప్రతిపాదించారని తెలిపారు. కడియం శ్రీహరి ప్రతిపాదనను ఆరుగురు మంత్రులు బలపరిచారని పేర్కొన్నారు. ఈ నెల 24న ఎల్బీ స్టేడియంలో జరిగే ప్లీనరీ సమావేశాల్లో కేసీఆర్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక పార్టీ గ్రేటర్ అధ్యక్ష ఎన్నికలు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు జరుగనున్నాయి. గ్రేటర్ అధ్యక్షుడిగా మైనంపల్లి హన్మంతరావు పేరును అధిష్టానం ఖరారు చేసింది. మరోవైపు.. ప్లీనరీ, బహిరంగసభపై పార్టీ ముఖ్యనేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. సీనియర్ నేత కేకే నివాసంలో జరిగిన భేటీలో ప్లీనరీలో 11తీర్మానాలు చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. రాజకీయ పార్టీగా టీఆర్‌ఎస్ నిర్వహించాల్సిన పాత్ర, వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ, హరితహారం, విశ్వనగరంగా హైదరాబాద్ సహా సంక్షేమ పథకాలపై తీర్మానాలు ఉంటాయి. ఎక్కువగా పార్టీ నేతలకే మాట్లాడే అవకాశమివ్వాలని నిర్ణయించారు. ఉదయం సీఎం కేసీఆర్ తరపున తెలంగాణ భవన్లో ఆరు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. డిప్యూటీ సీఎంలు కడియం శ్రీ హరి, మహమూద్ అలీ, మంత్రి జగదీశ్ రెడ్డి సీఎం కేసీఆర్ తరఫున నామినేషన్లు వేశారు. ఈనెల 21న నామినేషన్ల పరిశీలన జరుగనుంది. నామినేషన్ల ఉప సంహరణకు ఈనెల 23న గడువు విధించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం, పార్టీని బలోపేతం చేస్తామని, పార్టీలో యువతకు తగిన ప్రాధాన్యం కల్పిస్తామని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ అన్నారు. జీహెచ్‌ఎంసీపై గులాబీ జెండాను ఎగురవేస్తామని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని తెలిపారు. ఇవాళ తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ గ్రేటర్ హైదరాబాద్ విభాగం అధ్యక్ష ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అందరూ చురుగ్గా పాల్గొన్నానని అన్నారు. ప్రజలు మరీ డబ్బు కట్టి టీఆర్‌ఎస్ సభ్యత్వం స్వీకరించారని తెలిపారు.