టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మోటార్‌ సైకిల్‌ ర్యాలీ

ఆదిలాబాద్‌, జనవరి 4 (): తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కేంద్రంపై ఒత్తిడిని పెంచే భాగంగా శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మోటారు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని ఆదిలాబాద్‌, గుడిహత్నూర్‌, ఇచ్చోడ, నిర్మల్‌, బైంసా, కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌, చెన్నూరు, మంచిర్యాల, లక్సెట్టిపేట, ఉట్నూరు, ఖానాపూర్‌ తదితర ప్రాంతాల్లో జరిగిన మోటార్‌ సైకిల్‌ ర్యాలీలో టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు జోగు రామన్న, సమయ్య, అరవిందారెడ్డి, ఓదేలుతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమారెడ్డి, రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు రాములునాయక్‌, శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం నాడు ఆదిలాబాద్‌లో స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, తెలంగాణ నాయకులు భారీ మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక విశ్రాంతి భవన్‌ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామన్న మాట్లాడారు. జనవరి నెలఖరులోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రం ఏర్పాటులో ఆయా పార్టీలు అఖిల పక్షం సమావేశంలో తమ వైఖరిని వెల్లడించినందున సత్వరమే తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలన్నారు. కేంద్ర మంత్రి షిండే ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్‌ తమ నిర్ణయాన్ని వెల్లడించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు.