టీఆర్‌ఎస్ హయాంలోనే.. యువతకు ప్రాధాన్యత
– నాలుగేళ్లలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగింది
– మరోసారి ఆశీర్వదిస్తే బంగారు తెలంగాణగా నిలుపుతాం
– ఆపద్ధర్మ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
గులాబీ కండువా కప్పుకున్న చామన్‌పల్లి యువత
నిర్మల్, అక్టోబర్13(జనంసాక్షి) : టీఆర్‌ఎస్ హయాంలోనే యువతకు న్యాయం జరుగుతుందని, విద్య, ఉపాధి అంశాలను సీఎం కేసీఆర్ సర్కారు ప్రథమ ప్రాధాన్యంగా గుర్తించి పనిచేస్తోందని ఆపద్ధర్మ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం నిర్మల్ జిల్లా లక్ష్మణ చందా మండలం చామన్ పల్లికి చెందిన వంద మంది యువకులు స్వచ్ఛందంగా నిర్మల్ లోని ఇంద్రకరణ్ నివాసానికి తరలివచ్చి ఆయన చేతులవిూదుగా గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల సంతృప్తి చెందిన యువత ముక్తకంఠంతో కారు గుర్తుకే జై కొడుతున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో యువత ఉద్యమ స్పూర్తితో పనిచేయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్నివిధాలా అభివృద్ధి చెందుతోందనీ, మరోమారు కారు గుర్తుకు ఓటేసి పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకొందామని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నిర్మల్ మున్సిపాలిటీ కౌన్సెలర్ చందుపట్ల రవి తండ్రిని ఆపద్ధర్మ మంత్రి శ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శనివారం ఉదయం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకొన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని ఆకాంక్షించారు.