టీఎస్‌పీఎస్సీకి ప్రతిష్టాత్మక అవార్డు

2

న్యూఢిల్లీ,డిసెంబర్‌11(జనంసాక్షి): తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ , విూ సేవ డిజిటల్‌విభాగాలకు స్కోచ్‌ సంస్థ 2015 స్మార్ట్‌ టెక్నాలజీ వినియోగంలో జ్యూరీ అవార్డులు దక్కాయి. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ఈ సంస్థ నుంచి నాలుగు ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ అవార్డులు అందుకోగా ఈ రెండు వాటికి అదనం. శుక్రవారం స్కోచ్‌ సంస్థ ఛైర్మన్‌ సవిూర్‌ కొచ్చర్‌ నుంచి టీఎస్‌ పీఎస్సీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి, విూ సేవ తరఫున డిప్యూటీ డైరెక్టర్‌ పెండ్యాల శ్రీనివాస్‌ ఈ అవార్డులను అందుకున్నారు. ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ అవార్డులు అందుకున్న విభాగాల పనితీరును ప్రామాణికంగా తీసుకున్న స్కోచ్‌ సంస్థ తీవ్ర కరసత్తు అనంతరం ఈ జ్యూరీ అవార్డులను ప్రకటించింది. ఈ సందర్భంగా పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి విూడియాతో మాట్లాడుతూ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌తో పాటు జ్యూరీ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. స్వరాష్ట్రంలో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటైన11 నెలల 23 రోజుల్లోనే అవార్డులు అందుకోవటం తమ సంస్థ పనితీరుకు నిదర్శనమని అన్నారు. వచ్చేనెలలో యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ దీపక్‌ గుప్తా తన బృందంతో హైదరాబాద్‌ వచ్చి జనవరి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు సదస్సు నిర్వహిస్తున్నారని తెలిపారు. దేశంలో తొలిసారి బయోమెట్రిక్‌ విధానాన్ని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిందని, ఈ విధానానికి యుపీఎస్సీ చైర్మన్‌ నుంచి ప్రశంస కూడా లభించిందని చెప్పారు. విూ సేవ డిప్యూటీ డైరెక్టర్‌ పెండ్యాల శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఇప్పటివరకు ఈ విధానం ద్వారా ఐదు కోట్ల మందికి పైగా సేవలందించామని చెప్పారు. ఈ సేవలను మరింత ప్రతిభావంతంగా అందించడం కోసం విూ సేవ – 2.0 అనే కొత్త అప్లికేషన్‌ను తయారుచేశామని తెలిపారు. రోజుకు లక్ష మందికి విూ సేవ ద్వారా సేవలందిస్తున్న తమ విభాగం భవిష్యత్తులో నూతన అప్లికేషన్‌ ద్వారా వేగంగా, మెరుగైన, సంతృప్తికరమైన సేవలను అందిస్తామని, సేవల పరిధిని కూడా విస్తరిస్తామని తెలిపారు.