టీజేఏసీ బయ్యారం యాత్ర ప్రారంభం

హైదరాబాద్‌, జనంసాక్షి: ఇనుప ఖనిజ పరిరక్షణ యాత్ర పేరుతో బయ్యారానికి ప్రచారయాత్రను జేఏసీ చైర్మన్‌ కోదండరాం ప్రారంభించారు. సీఎం కిరణ్‌ బయ్యారం ఉక్కు విషయంలో అహంకారంతో మాట్లాడుతున్నాడని అన్నారు. బయ్యారంపై ఇచ్చిన జీవోలు తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. బయ్యారం నుంచి ఒక్క ఇనుప ముక్కను కూడా విశాఖకు తరలించలేరని తెలిపారు. ఆంధ్ర పాలకులు బలవంతులైతే , మేము బలహీనులం మాత్రం కాదని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజ్యాంగం కల్పించిన హక్కులను అమలు పరచడం లేదని చెప్పారు. బయ్యారంపై ముఖ్యమంత్రి బహిరంగంగా సవాల్‌ విసురుతూ నాగరిక విలువలు, చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని తెలిపారు. బయ్యారం ఉక్కును విశాఖ పరిశ్రమకు తరలిస్తే ఆంధ్రా ఆర్థిక పరిస్ధితి మెరుగుపడుతుంది, కాని బయ్యారంలోనే 10లక్షల టన్నుల సామర్థ్యం గల ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే 10వేల మంది ఆదివాసీల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.