టీడీపీకి మరో ఝలక్
కొడాలినాని ఔట్.. మరి కొందరు డౌట్ ?
నాని నిర్ణయంతో నాకు సంబంధం లేదు జూ.ఎన్టీఆర్
హైదరాబాద్, జూలై 9 (జనంసాక్షి): గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. నాని క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ ఆయనపై పార్టీ వేటు వేసింది. సోమవారం నాడు ఆయన లోటస్‌పాండ్‌లో వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో భేటీ అయ్యారు. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హుటాహుటిన కృష్ణా జిల్లా నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించి నాని వ్యవహారంపై చర్చించారు. కృష్ణా జిల్లా నేతల సూచన మేరకు నానిని పార్టీ నుంచి బహిష్కరించాలని చంద్రబాబు నిర్ణయించారు. గత కొద్ది కాలం నుంచి నాని వైఎస్సార్ సీపీలో చేరుతారనే వార్తలు వచ్చాయి. గుడివాడ నియోజకవర్గంలో జగన్‌తో నాని కలిసి ఉన్న ఫ్లెక్సీలు కూడా దర్శనమిచ్చాయి. ఈ తరుణంలో నానిని పిలిపించి చంద్రబాబు చర్చించారు. తొందరపడి పార్టీ నుంచి వెళ్లవద్దని బుజ్జగించారు. సమస్యలు ఎవైనా ఉంటే పరిష్కరించుకుందామని ఆయన సర్ది చెప్పారు. అప్పట్లో చంద్రబాబు మాటలను వినినట్టే కనిపించిన నాని ఎట్టకేలకు అధినేత మాటలను సైతం పెడచెవిన పెట్టి ఆయన వైఎస్సార్ సీపీలో చేరేందుకే నిర్ణయించుకున్నారు. సోమవారం నాడు ఆయన వైఎస్ విజయమ్మతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం చంచల్‌గూడ జైలులో ఆయన జగన్‌తో సమావేశమయ్యారు. కార్యకర్తల అనుమతితోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని నాని చెప్పారు. జగన్‌తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడతానని చెప్పారు. 2004లో నాని గుడివాడ నుంచి టీడీపీ తరుఫున పోటీ చేశారు. 2009లో కూడా ఆయన ఇక్కడి నుంచే గెలుపొందారు. ఆయనకు టికెట్ రావడంలో రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారు. జూనియర్ ఎన్టీఆర్‌తో కొడాలి నాని పలు సినిమాలను నిర్మించారు. నాని ప్రాతినిథ్యం వహిస్తున్న గుడివాడ నియోజకవర్గంలో ఎస్సీ,ఎస్టీ, బీసీ వర్గాలు అధికంగా ఉండడం, వీరంతా వైఎస్సార్ సీపీ వైపు మొగ్గుచూపుతున్న పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో నాని వైఎస్సార్ సీపీ వైపు చూడకతప్పలేదు. రాజకీయ భవిష్యత్తు కోసం నాని ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అంతకుముందే కృష్ణా జిల్లాకు చెందిన మరో నేత వలభనేని వంశీ కూడా జగన్ పార్టీలో చేరతారనే ఊహాగానాలు వచ్చాయి. విజయవాడ నడిరోడ్డుపై ఆయన జగన్‌తో కలవడం అప్పట్లో సంచలనం రేపింది. దీనిపై ఆయనకు షోకాజ్ నోటీసు జారీ అవ్వడం, ఆయన వివరణ ఇస్తూ తాను పార్టీ నుంచి బయటకు వెళ్లేది లేదని స్పష్టం చేశారు. ఆ తరువాత కొద్ది కాలానికే నాని పార్టీ వీడడం విశేషం. కొడాలి నాని వల్లభనేని వంశీ, వంగవీటి రాధ మంచి మిత్రులనే విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. ఇప్పటికే వంగవీటి రాధ జగన్ పార్టీలో చేరారు. తాజాగా నాని కూడా ఆ పార్టీలో చేరడంతో కృష్ణా జిల్లాలో మరింత మంది నాయకులు జగన్ పార్టీలోకి వలసపోయే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే నూజివీడు ఎమ్మెల్యే చిన్నంరామకోటయ్య కూడా టీడీపీని వీడుతారన్న వార్తలు వచ్చాయి. అయితే చంద్రబాబు ఆయనతో మాట్లాడడంతో రామకోటయ్య ప్రస్తుతానికి పార్టీలోనే కొనసాగుతున్నారు. అయినప్పటికీ కృష్ణా జిల్లాలో టీడీపీ నుంచి రానున్న రోజుల్లో మరిన్ని వలసలు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు.
నాకు ఎలాంటి సంబంధంలేదు… జూనియర్ ఎన్టీఆర్
కాగా కొడాలి నాని నిర్ణయంతో తనకెలాంటి సంబంధం లేదని జూనియర్ ఎన్టీఆర్ ఒక తెలుగు చానల్‌తో మాట్లాడుతూ చెప్పారు. నాని చర్యలను ఖండిస్తున్నానని చెప్పారు. నాని నిర్ణయం తనకు తీవ్ర అసంతృప్తి కలిగించిందన్నారు. తాను టీడీపీలోనే ఉన్నానని, టీడీపీతోనే ఉంటానని జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేశారు. ఆయన తండ్రి హరికృష్ణ కూడా నాని నిర్ణయంతో తమకెలాంటి సంబంధంలేదన్నారు. నానితో సినిమా సంబంధాలే తప్ప రాజకీయ సంబంధాలు లేవని అన్నారు. ఇదిలా ఉండగా, కొడాలి నాని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల కృష్ణా జిల్లా టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాని పార్టీకి వెన్నుపోటు పొడిచారని, రాజకీయ వ్యభిచారి అని దుయ్యబట్టారు. రెండు సార్లు ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించిన ప్రజలకు ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గుడివాడ నియోజకవర్గంలోని నాలుగు మండలాల నేతలు కూడా నాని నిర్ణయం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాము నానితో వెంట వెళ్లే ప్రసక్తేలేదని చెప్పారు. ఇప్పటికే గుడివాడ, గుడివాడ రూరల్, నందివాడ మండలాల నేతలు నాని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేశారు. గుడివాడలో నాని దిష్టి బొమ్మలను టీడీపీ కార్యకర్తలు దగ్ధం చేసి నానిపై విమర్శలు కురిపించారు.