టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికకు కసరత్తు
హైదరాబాద్,డిసెంబరు 9 (జనంసాక్షి):గాంధీభవన్‌లో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ముగిసింది. బుధవారం సాయంత్రం టీ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణికం ఠాగూర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలోఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, సీతక్క, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, వీహెచ్, మధుయాష్కీ, పొన్నాల లక్ష్మయ్య హాజరయ్యారు. కొత్త పీసీపీ అధ్యక్షుడి ఎంపికపై చర్చించారు. కోర్ కమిటీ సభ్యులు తమ తమ అభిప్రాయాలను మాణికం ఠాగూర్‌కు తెలియజేశారు. సమావేశం అనంతరం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఉత్తమ్ కుమార్‌రెడ్డి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. అనంతరం? విూడియాతో మాట్లాడుతూ.. కోర్ కమిటీ సమావేశంలో తన అభిప్రాయం చెప్పలేదని, సోనియా గాంధీ ఏ నిర్ణయం తీసుకుంటే తనది అదే నిర్ణయం అని చెప్పారు.అంతకు ముందు మణికం ఠాగూర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కోసం ఉత్తమ్ చాలా కష్టపడ్డారని ప్రశంసించారు. దుబ్బాక గెలుపు కోసం ఉత్తమ్ తీవ్రంగా కృషి చేశారన్నారు. కొత్త పీసీసీ ఎంపిక జరిగే వరకు చీఫ్‌గా ఉత్తమ్ కుమారే కొనసాగుతారని స్పష్టం చేశారు. కాగా, పీసీసీ పదవి కోసం కోమటిరెడ్డి తో పాటు రేవంత్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేసులో ఉన్న సంగతి తెలిసిందే.
కొత్త అధ్యక్షుడి ఎంపికపై అభిప్రాయ సేకరణ: మాణికం ఠాగూర్
కోర్‌కమిటీ భేటీ ముగిసిన అనంతరం మాణికం ఠాగూర్ విూడియాతో మాట్లాడారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమ శక్తినంతా ఉపయోగించామన్నారు. సమస్యలను అధిగమించి సమర్థమైన పార్టీగా కాంగ్రెస్ త్వరలోనే రూపుదిద్దుకుంటుందని ఆయన చెప్పారు. ఇన్నిరోజులు టీపీసీసీని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమర్థంగా నడిపారన్నారు. ఆయన రాజీనామా చేయడంతో నూతన అధ్యక్షుడి ఎంపిక మొదలుపెట్టినట్లు మాణికం ఠాగూర్ చెప్పారు. దాదాపు 150 మంది పార్టీ నేతల అభిప్రాయాలను తీసుకోవాల్సి ఉందన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీసీసీ మాజీ అధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, సీనియర్‌నేతల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని ఆయన తెలిపారు.