టీ అడ్వకేట్ జేఏసీ ధూం తడాఖా
మెదక్, డిసెంబర్ 25 (జనంసాక్షి) :
సమైక్యవాది జగ్గారెడ్డిని ‘తూర్పు’ఆరాబట్టిన తెలంగాణవాదులు
సమైక్యవాది జగ్గారెడ్డి వ్యాఖ్యలపై న్యాయవాదులు మండిపడ్డారు. న్యాయదేవత సన్నిధిలో ఎంతో ప్రశాంతంగా కనిపించే లాయర్లు సంగారెడ్డిలోని జగ్గారెడ్డి ఇంటిని ముట్టడించారు. సీమాంధ్ర సొమ్ములకు ఆశపడ్డ జగ్గారెడ్డి నిను క్షమించదు ఇక్కడి ప్రజా అంటూ నినదించారు. ఇక్కడి ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేవై వారి ఆకాంక్షలనే ఎగతాళి చేస్తావా అంటూ మండిపడ్డారు. ఇక నిన్ను క్షమించబోమని త్వరలోనే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. టీ అడ్వకేట్ జేఏసీ ఆధ్వర్యంలో న్యాయవాదులు తెలంగాణ ధూం తడాఖా చూపించారు. దీంతో సంగారెడ్డిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ద్రోహి సంగారెడ్డి ఎమ్మెల్యే అని ఆరోపిస్తూ ఆయన ఇంటిని తెలంగాణ లాయర్లు ముట్టడించారు. ఎమ్మెల్యే నివాసం వద్ద జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. దీంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా
వేడెక్కింది. ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నాకు దిగిన తెలంగాణ అడ్వకేట్ జెఎసి నేతలు జగ్గారెడ్డి ఒక తెలంగాణ ద్రోహి అని నినాదాలు చేశారు. జగ్గారెడ్డికి దమ్ముంటే పదవికి రాజీనామా చేసి సమైక్యాంధ్ర నినాదంతో మళ్లీ గెలవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. జగ్గారెడ్డికి ఇకపై రాజకీయ సమాధి నిర్మిస్తామని వారు హెచ్చరించారు. ఎమ్మెల్యే ఇల్లు ముట్టడికి యత్నించిన తెలంగాణ న్యాయవాదులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులకు, లాయర్లకు మద్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంటివైపు దూసుకెళ్లేందుకు లాయర్లు ప్రయత్నించడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జీ చేశారు. దీంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పోలీసులు సీమాంధ్ర తొత్తులుగా మారరని తెలంగాణ లాయర్ల జెసి నాయకులు వారిపై విరుచుపడ్డారు. సమైఖ్యవాదులకు తెలంగాణలో తావు లేదంటూ నినదించారు. అధికారంలో ఉన్న నాయకులుకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని వారు విమర్శించారు. పోలీసులకు లాయర్లకు మధ్య ఘర్షణ జరగడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది.
సంగారెడ్డి కోర్టు నుంచి ర్యాలీగా వెళుతున్న న్యాయవాదులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ముందుకు సాగిపోతోన్న న్యాయవాదులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జీ చేశారు. ఈ లాఠీ ఛార్జీలో గంప వెంకటేశం అనే న్యాయవాది కాలు విరిగింది. ఆయన ఆసుపత్రిలో చేరారు. మరోవైపు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి సంగారెడ్డికి చేరుకున్న న్యాయవాదులు శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు విరుచుకుపడ్డారు. తెలంగాణ న్యాయవాదులకు అడుగడుగునా అడ్డుపడ్డారు. న్యాయవాదులు ఎక్కడ దొరికితే అక్కడ చితకబాది చెదరగొట్టారు. అయినా తాము ఇచ్చిన పిలుపు మేరకు వారు అంతా కోర్టు ఆవరణకు చేరుకుని సమావేశమవుతుండగా పోలీసులు మరోసారి విరుచుకుపడి లాఠీచార్జీ చేశారు. న్యాయవాదులు కోర్టు గదుల్లోకి చేరుకోగా గదుల తలుపులను పోలీసులు పగులగొట్టి న్యాయవాదలు చెదిరిపోయేలా చేశారు. ఎమ్మెల్యే ఇల్లు ముట్టడికి ప్రయత్నించిన న్యాయవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని సంగారెడ్డి రూరల్, సంగారెడ్డి టౌన్ పోటీసు స్టేషన్లతోపాటు జిల్లాలోని ఎద్దుమైలారం, ఇంద్రకరణ్ ఇంకా ఇతర ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో నింపివేసింది. అయినా తెలంగాణ న్యాయవాదులు తమ పంతం వీడలేదు. పోలీసు స్టేషన్లలోనూ తమ నిరసనలు కొనసాగించారు. జై తెలంగాణ నినాదాలతో పోలీసు స్టేషన్‌లను హోరెత్తించారు. ఇదిలా ఉండగా తెలంగాణ ఉద్యమాన్ని తమ భుజాలకెత్తుకున్నతెలంగాణ లాయర్లను సీమాంధ్ర ప్రభుత్వం కేసులతో భయపెట్టాలని చూస్తోందని తెలంగాణ అడ్వకేట్ జెఎసి నాయకులు మండిపడ్డారు. ‘ఛలో సంగారెడ్డి’ కార్యక్రమంలో పాల్గొన్న లాయర్లను అరెస్టు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేసిందని, జిల్లా పోలీసులు యాభై మంది లాయర్లపై నాన్‌బెయిల్‌బుల్ కేసులు నమోదు చేసారని జెఎసి నేతలు ధ్వజమెత్తారు.