టీ20 ర్యాంకింగ్స్‌లో ఫించ్‌ కొత్త రికార్డు

దుబాయ్‌, జులై9(జ‌నం సాక్షి) : ఆస్టేల్రియా కెప్టెన్‌, ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ ఆరోన్‌ ఫించ్‌ టీ20 ర్యాంకింగ్స్‌లోనూ రికార్డులు బద్దలు కొట్టాడు. టీ20ల చరిత్రలో తొలిసారి 900 పాయింట్ల మార్క్‌ అందుకున్న ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. జింబాబ్వే, పాకిస్థాన్‌, ఆస్టేల్రియా ట్రై సిరీస్‌ ముగిసిన తర్వాత ఫించ్‌ మూడు స్థానాలు ఎగబాకి అగ్రస్థానం ఆక్రమించాడు. ఈ సిరీస్‌లో జింబాబ్వేపై 172 పరుగులు చేసి టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును ఫించ్‌ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ రికార్డు తర్వాత ఫించ్‌ 900 పాయింట్ల మార్క్‌ను అందుకున్నాడు. అయితే సిరీస్‌ ముగిసే సమయానికి 891 పాయింట్లతో తొలి స్థానంలోనే కొనసాగుతున్నాడు. ఈ సిరీస్‌కు ముందు 763 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న ఫించ్‌.. మొత్తంగా 391 పరుగులు చేశాడు. దీంతో 128 పాయింట్లు తన ఖాతాలో వేసుకొని తొలి స్థానానికి దూసుకొచ్చాడు. పాకిస్థాన్‌ ఓపెనర్‌ ఫకర్‌ జమాన్‌ రెండోస్థానంలో ఉన్నాడు. ఇక టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ ఏకంగా తొమ్మిది స్థానాలు ఎగబాకి కెరీర్‌ బెస్ట్‌ 3వ ర్యాంక్‌ను అందుకున్నాడు. రాహుల్‌ తర్వాత రోహిత్‌ 11, కోహ్లి 12వ స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన రషీద్‌ ఖాన్‌ తొలి స్థానంలో, పాకిస్థాన్‌కు చెందిన షాదాబ్‌ ఖాన్‌ రెండోస్థానంలో ఉన్నారు. టీమ్‌ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్‌ తన తొలి స్థానాన్ని నిలబెట్టుకోగా.. ఇంగ్లండ్‌పై సిరీస్‌ గెలిచిన ఇండియా ఆస్టేల్రియాను వెనక్కి నెట్టి రెండోస్థానానికి దూసుకెళ్లింది. 2020లో ఆస్టేల్రియాలో జరిగే టీ20 వరల్డ్‌కప్‌కు ఆస్టేల్రియా కాకుండా టాప్‌ 9 ర్యాంకుల్లో ఉన్న టీమ్స్‌ నేరుగా క్వాల్గి/ అవుతాయి. మరో ఆరు జట్లు క్వాలిఫయింగ్‌ టోర్నీలో ఆడాల్సి ఉంటుంది.