టెన్త్‌లో జిల్లాను ముందు నిలపాలి
యాదాద్రిభువనగిరి,డిసెంబర్20(జనంసాక్షి): రాబోయే పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్య, సంక్షేమ వసతిగృహాల అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ అనితారామచంద్రన్ ఆదేశించారు.పది ఫలితాల్లో మన జిల్లా తొలి పది స్థానాల్లో ఉండేలా ప్రణాళిక రూపొందించాలని విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ప్రత్యేక బోధకులను నియమించి విద్యార్థుల సందేహాలు నివృత్తి చేయాలని అన్నారు. మార్చిలో జరగనున్న పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు. ఇప్పటి నుంచే ప్రతి రోజూ ప్రత్యేక తరగతి నిర్వహించి వారి సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. మండల సమన్వయ అధికారులు ప్రతి వారం తమకు కేటాయించిన మండలానికి వెళ్లి తనిఖీలు చేపట్టడంతోపాటు వసతిగృహాల్లో రాత్రి బస చేయాలని ఆదేశించారు. జిల్లాలో గ్రావిూణ ప్రాంతాల్లో రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేస్తూ మరమ్మతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలన్నారు. రహదారుల దుస్థితిపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను రహదారులు, భవనాలశాఖ అధికారుల దృష్టికి తెచ్చారు.