టెన్త్ ఉత్తీర్ణత పెంచేలా కార్యాచరణ
వరంగల్,జనవరి22(జనంసాక్షి): మార్చిలో జరగనున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఏడాది పరీక్షలను పూర్తిగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యేడాది పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత మరింత పెంచటానికి ఇప్పటి నుంచే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సమ్మేటివ్ పరీక్షలు పూర్తయిన తర్వాత గ్రేడింగ్ తీసి వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను దత్తత తీసుకొని శిక్షణ ఇవ్వనున్నారు. అందరికీ కలిపి జనవరి రెండోవారం నుంచి స్లిప్ టెస్టులను నిర్వహిస్తామని డీఈవో అన్నారు. ఈ లోగా సిలబస్‌ను పూర్తి చేసి అందుకు అనుగుణంగా తర్ఫీదు ఇస్తామని చెప్పారు. గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వం పోటీ పరీక్షలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని కేవలం ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే నిర్వహించింది. అలాగే పదోతరగతి, ఇంటర్ తదితర పరీక్షలను కూడా ఇలాగే నిర్వహించాలనే యోచనలో ఉంది. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని జిల్లా విద్యాశాఖాధికారులు తెలిపారు.పరీక్ష కేంద్రాలను ప్రభుత్వ విద్యాసంస్థలతోపాటు ప్రైవేటు సంస్థల్లో కూడా ఏర్పాటు చేసేవారు. దాతల సహకారంతో విద్యార్థులకు అల్పాహారం ఏర్పాటు చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సారి అల్పాహారం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసే అవకాశం ఉంది. జిల్లాలోని కొన్ని ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది. అక్కడి విద్యార్థులకు సబ్జెక్టు పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి సవిూపంలోని ప్రాథమికోన్నత పాఠశాలల్లో అర్హులైన ఉపాధ్యాయులతో శిక్షణ ఇవ్వటానికి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు.