టెస్టుల్లో జహీర్‌ను వెనక్కి నెట్టిన అశ్విన్‌

315వికెట్ల తీసిన నాల్గో ఆటగాడిగా అశ్విన్‌

బెంగళూరు, జూన్‌15(జ‌నం సాక్షి ) : ఆఫ్గానిస్థాన్‌తో బెంగళూరు వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు 474 పరుగులకి ఆలౌటవగా.. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన అఫ్గానిస్థాన్‌ జట్టు అశ్విన్‌ ధాటికి 109 పరుగులకే కుప్పకూలిపోయింది. మ్యాచ్‌లో తానేసిన తొలి ఓవర్‌లోనే అస్గర్‌ వికెట్‌ పడగొట్టిన అశ్విన్‌ భారత తరఫున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు. టెస్టుల్లో టీమిండియా తరఫున ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాని ఓ సారి పరిశీలిస్తే.. అనిల్‌ కుంబ్లే 619 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా తర్వాత వరుసగా కపిల్‌దేవ్‌ (434), హర్భజన్‌ సింగ్‌ (417) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ టెస్టు ముందు వరకు నాలుగో స్థానంలో జహీర్‌ ఖాన్‌ 311 వికెట్లతో ఉండగా.. తాజాగా 4 వికెట్లు పడగొట్టిన అశ్విన్‌ మొత్తం 315 వికెట్లతో అతడ్ని వెనక్కి నెట్టి టాప్‌-4లో నిలిచాడు.