ట్యాంకర్లతో చీనీ తోటలకు నీరు

చుక్కనీరు లేక నానా యాతన
కరవు రైతులను ఆదుకోవాలంటున్న రైతాంగం
అనంతపురం,మే15(జ‌నంసాక్షి): కరువుసీమ అనంతపురంలో చీనీ పంట ఈ ఏడాది రైతుకు కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇటీవల సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత తక్కువ వర్షపాతం ఈ ఏడాది నమోదుకావడంతో పాటు బోరుబావుల్లో నీరుకూడా ఇంకిపోవడంతో చీనీ చెట్లు కళ్లముందే ఎండిపోతున్నాయి. దీంతో రైతులు లబోదిబో అంటున్నారు. బోర్లలో నీరు ఇంకిపోవడంతో పంట వస్తున్న సమయంలోవాటిని రక్షించు కునేందుకు రైతులు అనేక కష్టాలు పడుతున్నారు. ట్యాంకర్లతో రైతులు నీటిని తోలుకుని పంటలను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి రోజుకు 30 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఏదోరకంగా చెట్లను బతికించుకుంటే వచ్చే ఏడాదైనా వర్షం పడక పోదా… నాలుగు కాసులు కంట చూడకపోతామా అన్న ఆశతో ఉన్నారు. ఇటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని వీరంటున్నారు. జిల్లాలో 1.21 లక్షల ఎకరాల్లో చీనీ సాగవుతోంది. వీటిలో అత్యధికభాగం పంట ఈ ఏడాది నిలువునా ఎండిపోతోంది. ఐదేళ్లు కష్టపడి పెంచితే ఆరో సంవత్సరం నుంచి దిగుబడి వస్తుంది. అలా 25 ఏళ్లు 30 ఏళ్ల వరకూ వచ్చే పంట ఇప్పుడు వర్షాభావంతో నీళ్లులేక ఉన్న ఫలంగా పంట ఎండిపోతే రైతు కొన్నేళ్ల కష్టాన్ని కోల్పోవలసి వస్తుంది.  తుపాను ప్రాంతంలో నష్టం జరిగితే ఏ విధంగా ఆదుకుం టారో తమను కూడా అలాగే కరువు సమయం లోనూ ఈ ప్రాంత రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. శింగనమల, నార్పల, యల్లనూరు, పుట్లూరు గార్లదిన్నె తదితర ప్రాంతాల్లో ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. మిగిలిన జిల్లాలతో పోలిస్తే అనంతపురంలో తక్కువ వర్షపాతం నమోదవుతున్నది. మరోవైపు అతి తక్కువగా వర్షపాతం భూగర్భ జలాలపైకూడా ప్రభావం చూపుతోంది. జిల్లాలో చీనీ దిగుబడి దేశంలోనే అత్యధికమని చెప్పాలి. ఎకరానికి పది టన్నుల వరకు దిగుబడి వస్తుంది. అయితే వర్షాభావం, నీటి తడులు లేకపోవడం వంటి కారణాలతో  పది టన్నులు రావాల్సిన చోట నాలుగైదు టన్నులకు మించి రావడం లేదు. ఇంత తక్కువగా పంట వచ్చినా మార్కెట్‌లో ధర మాత్రం టన్ను రూ.30 వేలకు మించడం లేదు. గత ఏడాది ఇదే సమయంలో రూ.1.20 లక్షల వరకు పలికింది. కానీ ఈసారి దిగుబడి తగ్గడం, ధర లేకపోవడంతో అన్ని విధాలుగా చీని రైతులు నష్టపోతున్నారు.
పంట చేతికి వస్తున్న సమయంలో బోరుబావుల్లో నీరు ఇంకిపోయాయి. కొత్తగా బోర్లు వేసినా నీరు పడడంలేదు. చీనీ రైతులను ఆదుకోవాలని ఎపి పండ్లతోటల రైతు సంఘం జిల్లా కార్యదర్శి  శివారెడ్డి కోరారు.