ట్యాంపరింగ్ చేస్తే ఆ మూడు రాష్ట్రాల సంగతేంటి?
కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారు
అయినా బుద్ది రాలేదన్న సిఎం కెసిఆర్
హైదరాబాద్,డిసెంబర్29(జనంసాక్షి): ఎన్నికల్లో ఇవిఎంలను ట్యాంపరింగ్ చేశామని కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలపై సిఎం కెసిఆర్ మండిపడ్డారు. అలా అయితే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచిందని, దానిని ఏమనాలని అన్నారు. అలా చేసుంటే మూడు రాష్టాల్లో వాళ్లు ట్యాంపరింగ్ చేసే గెలిచారా? అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. శనివారం విూడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాము ట్యాంపరింగ్ చేసి వుంటే తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయేవారా అని అన్నారు. ఓటమిని అంగీకరించే ధైర్యం నాయకులకు ఉండాలన్నారు. తమ పార్టీకి చెందిన ముగ్గురు మంత్రులు కూడా ఓటమి పాలయ్యారని అన్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో కేసీఆర్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారని పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై కేసీఆర్‌ను ప్రశ్నించగా తాము ట్యాంపరింగ్‌కు పాల్పడాల్సిన అవసరం లేదని, అలా అయితే తుమ్మలను ఎందుకు పోగొట్టుకుంటామని అన్నారు. కాగా తెలంగాణతో పాటు జరిగిన ఎన్నికల్లో నాలుగు రాష్టాల్ర ఎన్నికల్లో మూడు రాష్టాల్లో గెలిచిన కాంగ్రెస్ ట్యాంపరింగే చేసిందానని కేసీఆర్ ఎదురు ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు సాకులు వెతుక్కోవడం దారుణమన్నారు. వారికి ప్రజలు కర్రుకాల్చి వాతలు పెట్టినా బుద్ది రాలేదన్నారు. ప్రజల తీర్పును అపహాస్యం చేయడం తగదన్నారు.