ట్రిలియన్‌ డాలర్లే లక్ష్యం

పెట్టుబడులపై ప్రభుత్వ దృష్టి శ్రీసవాళ్లను అధిగమిద్దాం
కేబినెట్‌ సమావేశంలో ప్రధాని

న్యూఢిల్లీ, నవంబర్‌ 1 (జనంసాక్షి) : మందగించిన దేశ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెట్టుబడులు తగ్గిపోయిన నేపథ్యంలో.. మౌలిక వసతుల రంగంలోకి ట్రిలియన్‌ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా నిర్దేశించింది. దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని నిర్ణయం తీసుకుంది. ఎన్నికలతో సంబంధం లేకుండా.. ప్రస్తుత అడ్డంకులను అధిగమిం చేందుకు ప్రభుత్వం మరిన్ని సంస్కర ణలు చేపట్టాలని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని కఠిన నిర్ణయాలు తప్పవని సూత్రప్రాయంగా తెలిపారు. 12వ పంచవర్ష ప్రణాళికలో ఇంధన సరఫరా, భద్రతా, ఆర్థిక ఇబ్బందులకు తగిన ప్రాధాన్యామివ్వనున్నట్లు తెలిపారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ గురువారం తన నివాసంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. మంత్రిమండలి పునర్‌వ్యవస్తీకరణ జరిగిన తర్వాత కేంద్ర మంత్రులు భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో దేశ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పరిచేందుకు తీసుకోవాల్సిన చర్యల మన్మోహన్‌ వెల్లడించారు. ప్రభుత్వ లక్ష్యాలను మంత్రులకు ప్రధాని వివరించారు. 2014లోగా సాధించాల్సిన ప్రగతిని నిర్దేశించారు. తొమ్మిదేళ్ల యూపీఏ పాలనలో సాధించిన విజయాలను ప్రధాని క్యాబినెట్‌ సమావేశంలో ప్రస్తావించారు. తొమ్మిదేళ్ల పాలనలో జాతీయ ఉపాధి హావిూ పథకం, ఆధార్‌ వంటి కార్యక్రమాలు చేపట్టి.. ఆర్థిక వృద్ధికి బాటలు వేశామని తెలిపారు. ప్రభుత్వ విజయాలను ప్రస్తావించి, ప్రధాని భవిష్యత్‌ లక్ష్యాలను మంత్రిమండలి ముందుంచారు. చేపట్టాల్సిన ఆర్థిక విధానాలను వివరించారు. పెనుసవాలుగా మారిన అంశాలను వివరిస్తూ.. తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అభిప్రాయాలు కూడా తెలిపారు. సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు సాగాలని మంత్రులకు ఉద్బోధించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సవాళ్లు ఉన్నాయన్న విషయాన్ని గుర్తించాలని, దాన్ని అవగాహన చేసుకొని తగిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రపంచ ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఎగుమతులు తగ్గిపోయాయని, అదే సమయంలో దిగుమతుల వ్యయం రెట్టింపైందన్నారు. ఈ నేపథ్యంలో స్వదేశీ, విదేశీ పెట్టుబడులను
ఆకర్షించేందుకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
స.హ. చట్టానికి సవరణలపై వెనక్కు..
సమాచార హక్కు చట్టానికి తలపెట్టిన వివాదాస్పద ముసాయిదా సవరణ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వెనక్కుతీసుకుంది. గురువారం ప్రధాని నేతృత్వంలో జరిగిన క్యాబినెట్‌ భేటీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో జాతీయ భద్రత లాంటి విషయాలకు సంబంధించిన అత్యంత ప్రాధాన్యం గల అంశాల ఫైల్‌ నోట్స్‌ తప్ప మిగతావన్నీ కూడా అవసరమైనప్పుడు బహిర్గతం చేస్తారు. 2006లో క్యాబినెట్‌ ఆమోదించిన ఈ సవరణలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో పార్లమెంట్‌కు రాలేదు.