డబుల్‌ బెడ్‌రూంలు జనహృదయ్‌

3

– కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు

హన్మకొండ/,వరంగల్‌,అక్టోబర్‌18(జనంసాక్షి):

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పథకం భేష్‌ అన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. నిరుపేదల కోసం రెండు పడక గదుల ఇండ్లు కట్టిస్తున్న సీఎం కేసీఆర్‌ ను అభినందించారు.  వరంగల్‌లో  వెయ్యిస్థంబాల గుడిలో హృదయ్‌ పథకం పైలాన్‌ ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన  సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశానికి  మన పూర్వీకులు అందించిన చారిత్రక వారసత్వంను కాపాడుకోవాలనే ఉద్ధేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హృదయ్‌ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. చారిత్రకంగా, వారసత్వంగా ప్రసిద్ధిగాంచిన నగరాలను అభివృద్ధి చేసేందుకు హృదయ్‌ పథకం ద్వారా దేశంలో 12 నగరాలను ఎంపి చేసినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి  ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. వారసత్వ నగరాల్లో ఎంపికలో భాగంగా వరంగల్‌ నగరాన్ని ఎంపిక చేసినట్లు ఆయన  వెల్లడించారు.  హృదయ్‌ పథకంలో భాగంగా రూ.40కోట్లతో నగరంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా రూ.36కోట్లను  మంజూరు చేసినట్లు, ఆదివారమే రూ.12కోట్ల చెక్‌ను ఉప ముఖ్యమంత్రికి అందజేసినట్లు ఆయన తెలిపారు. హృదయ్‌ పథకంలో   భాగంగా నగరాన్ని 5 వారసత్వ  జోన్‌లుగా గుర్తించి, ఖిలావరంగల్‌, భద్రకాళి ఫోర్‌ షోర్‌ బండ్‌, వెయ్యిస్థంబాల గుడి, వడ్డేపల్లి చెరువు,  కాజీపేట దర్గా అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.  నగరాల అభివృద్ధి, పరిపాలన, మెరుగు, పౌరసదుపాయాల కల్పనను ప్రజల భాగస్వామ్యం ముఖ్యమన్నారు. నగరం అభివృద్ధికి పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రజల భాగస్వామ్యంతో పాలకులు, అధికారులు కృషి చేయాలన్నారు.  వరంగల్‌ నగరంలో రింగ్‌రోడ్డు, సైక్లింగ్‌ ట్రాక్‌ సౌకర్యాలు ఉండాలని, నగర అభివృద్ధికి అన్ని పార్టీల వారు లయన్స్‌క్లబ్‌, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రజా సంఘాల అభిప్రాయాలు విస్తృత స్థాయిలో తీసుకని నిర్థిష్ట అవసరాలు పరిష్కర మార్గాలు చేప్తే పరిశీలించగలమన్నారు. 1972లో మొదటిసారి విద్యార్థి పరిషత్‌ రాష్ట్రస్థాయి సమావేశానికి వచ్చినట్లు  తరచుగా వివిధ స్థాయిలో వైభవంగా నగరాన్ని సందర్శించినట్లు ఆయన తెలిపారు. కాకతీయ పరిపాలనలో ఓరుగల్లు వైభవంగా వెలుగొందినట్లు  తెలిపారు. దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ పట్టణాల్లో పరిపాలన మెరగుకు ఆదునీకరణ, పౌరసేవలు, సుందరీకరణ అభివృద్ధికి ప్రాధాన్యత నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.  లక్ష జనాభా గల పట్టణాల్లో నీటి సరఫరా, డ్రైనేజీ, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, రవాణ, ఐటి సేవలు, పరిపాలన మెరుగు పరచేందుకు అమృత్‌ పథకంలో భాగంగా దేశంలో 500 నగరాలను ఎంపిక చేసినట్లు వెంకయ్యనాయుడు తెలిపారు.  తెలంగాణ రాష్ట్రంలో వరంగల్‌తో సహా ఇతర పట్టణాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా 100 నగరాలను ఆకర్షణీయ నగరాలుగా ఎంపిక చేసినట్లు తెలంగాణ రాష్ట్రంలో వరంగల్‌, హైదరాబాద్‌ నగరాలను  ఆకర్షణీయ నగరాలుగా(స్మార్ట్‌సిటీ)లుగా  పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. 5 ఏండ్ల కాలంలో సిటీ ఛాలెంజ్‌ కింద నగరాల మధ్య పోటీలో సంవత్సరానికి 20 చొప్పున ఎంపిక చేసి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. రవాణా, పన్నుల వసూలు, ఆదాయం, ఉద్యోగుల నిష్పత్తి, పౌరపరిపాలన, విద్యుత్‌ తదితర అంశాలు ఎలా ఉన్నాయో పరిశీలించనున్నట్లు, ఆకర్షణీయ నగరాల ఎంపికకు మార్గదర్శకాలు రూపొందించి ఇటీవల మేయర్ల సమావేశం నిర్వహించి వివరించినట్లు, ఈ పోటీలో ఎంపిక కు నగరాలు పాల్గొనాల్సి ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కేంద్రం అందరికీ ఇల్లు కింద 2022నాటికి పేదలందరికీ ఇండ్లు నిర్మించాలని నిర్ణయించినట్లు దీనికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. ప్రధాన మంత్రి రాష్ట్రంలో అందిరికీ ఇల్లు పథకం కింద 34 పట్టణాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. అలాగే జన్‌ధన్‌ యోజన కింద 18కోట్ల మంది 5నెలలో బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు, అతి తక్కువ ప్రీమియంతో ఇన్స్‌రెన్స్‌ పథకం ప్రవేశపెట్టినట్లు చెప్పారు. వీటికి తోడు పేద వ్యాపారులకు ముద్ర యోజన ద్వారా రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ దేశంలో 100 ఆకర్షణీయ నగరాల ఎంపికలో వరంగల్‌ను ఎంపిక చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం, నగర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ దేశాల నుండి యాత్రికులు వరంగల్‌ను సందర్శించేలా నగరాన్ని అభివృద్ధి చేయాలని కోరారు.జిల్లాలో 2.50లక్షల హెక్టార్లలో పత్తి పండిస్తున్నారని, రైతులకు మద్దతు ధర పెంచాలని రాష్ట్రం కేంద్రానికి ప్రతిపాదనలు పంపిందని, వాటిని పరిశీలించి పత్తి కొనుగోలుకు సిసిఐ ఆంక్షలు సడలించి మరిన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమాలలో వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎంపి సీతారాంనాయక్‌, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, శంకర్‌నాయక్‌, ఆరూరి రమేష్‌, జిల్లా కలెక్టర్‌ వాకాటి కరుణ, నగర పాలక సంస్థ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, మాజీ మేయర్‌ టి. రాజేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.తొలుత కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వరంగల్‌ కోట ప్రాంతాన్ని సందర్శించారు. హృదయ్‌ పథకానికి సంబంధించిన ఏర్పాటు చేసిన మ్యాప్‌లను పరిశీలించారు. అనంతరం భద్రకాళి దేవాలయం ఫోర్‌షోర్‌ బండ్‌ పనులకు శంకుస్థాపన చేశారు.