డబ్బుకోసమే వృద్ధురాలి హత్య
– తిరుమలలో వృద్ధురాలి హత్యకేసును చేధించిన పోలీసులు
– వివరాలు వెల్లడించిన సీపీ అంజనీకుమార్
హైదరాబాద్, మే26(జనం సాక్షి) : తిరుమలగిరిలో జరిగిన వృద్దురాలి హత్యకేసులో నిందితులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బు కోసం వృద్దురాలిని హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్, తిరుమలగిరి పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 60 గ్రాముల బంగారం, 100 గ్రాముల వెండి, కత్తి, 6 సెల్‌ఫోన్లు, ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ..తిరుమలగిరిలో వృద్దురాలి హత్యకేసును సవాల్‌గా స్వీకరించి ఛేదించినట్లు ఆయన చెప్పారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశాం. నిందితులు నిజామాబాద్ జిల్లాకు చెందిన నిరాది అరుణ్, దాచేపల్లి సరస్వతి అని చెప్పారు. నిందితులు పథకం ప్రకారమే వృద్దురాలు సులోచన(66)ను హత్య చేశారు. డబ్బుకోసమే ఈ దారుణానికి పాల్పడ్డారని అన్నారు. అపహరించిన సొమ్మును నిరాది రాజమణి వద్ద ఉంచారన్నారు. గతంలో కూడా వీరిపై పలు కేసులున్నాయన్నారు. నగరాల్లో ఇళ్లలో పనులు మనుషులు నియమించుకొనే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇళ్లల్లో పనికోసం వచ్చేవారిని గుడ్డిగా నమ్మొదు అని పలు సూచనలు చేశారు.