డిండి ప్రాజెక్ట్‌ నుంచి నీటి విడుదల

ఆనందంలో ఆయకట్టు రైతులు

నల్లగొండ,జూలై21(జ‌నం సాక్షి): డిండి ప్రాజెక్టు నుంచి మంత్రి జగదీశ్‌రెడ్డి నీటిని విడుదల చేయడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా సీఎం కేసీఆర్‌ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా డిండిని నింపి సాగునీటిని విడుదల చేశారు. ప్రతి చుక్క నీటిని సద్వినియోగం చేసుకొని తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యం మేరకు పనులు పూర్తి చేశారు. ఫ్లోరైడ్‌ నిర్ములన ప్రాజక్టైన డిండి ఎత్తిపోతల పథకం రిజర్వాయర్లను పనులు యుద్ధప్రతిపాదికన జరుగుతున్నాయి. ఇకపోతే నీటి విడుదలతో ఆయకట్టులో సాగు సందడి నెలకొంది. రైతుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. నాలుగేళ్ల తర్వాత వానాకాలం సాగుకు నీటిని విడుదల చేస్తుండగా.. రైతులు వరి నార్లు పోసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మరోపక్క కాల్వల పునరుద్ధరణ, షట్టర్ల మరమ్మతు త్వరితగతిన పూర్తి చేయడంలో నీటి పారుదల శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. డిండి ప్రాజెక్టు ఆయకట్టులో ప్రతిఏటా తీవ్ర కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. పంటలు పండించుకునే వీలులేక చాలావరకు రైతులు భూములను పడావుగా ఉంచుతున్నారు. 1943లో డిండి ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. స్థిరీకరణ ఆయకట్టు 12,500 ఎకరాలు కాగా ప్రస్తుతం అనధికారికంగా మరో 6వేల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. అయితే వర్షాలు లేక ప్రాజెక్టులోకి సమృద్‌ధ్దిగా నీరు రాకపోవడంతో ఆయకట్టులో పూర్తిస్థాయిలో ఏనాడూ రెండు పంటలను పండించుకున్న పరిస్థితులు లేవు. ఎడమ కాల్వ ద్వారా జిల్లాలోని ఆయకట్టుకు నీరందుతుండగా కుడికాల్వ ద్వారా మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 350 ఎకరాలకు డిండి ప్రాజెక్టు ద్వారా సాగునీరందుతోంది. గతే డాది కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి నీటిని మళ్లించి డిండి ప్రాజెక్టును నింపడంతో ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీరు వానాకాలం సాగుకు అవసరపడుతోంది. 2013-14లో వానాకాలంలో డిండి ప్రాజెక్టు నుంచి సాగుకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులో నీరు లేని కారణంగా ఆ తర్వాత ఏ సంవత్సరంలోనూ నీటిని విడుదల చేయలేకపోయారు. నాలుగేళ్ల తర్వాత నీటిని విడుదల చేస్తుండటంతో రైతాంగం సంబరపడిపోతోంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథ కం నీటితో గతేడాది డిండి ప్రాజెక్టును నింపారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొంత మేర ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 36 అడుగులు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 26 అడుగుల నీటి మట్టం ఉంది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం నల్లగొండలో కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌, ఎంపీ గుత్తా, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌ సమక్షంలో ఆయకట్టు రైతులతో నిర్వహించిన సమావేశంలో నీటి విడుదలపై నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 21న ప్రాజెక్టు ఎడమకాల్వ నీటిని విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈమేరకు ముహూర్తం ఖరారు కాగా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి లాంఛనంగా శనివారం విడుదల చేయనున్నారు. నీటి విడుదల ప్రకటనతో డిండి ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో పంటల సాగు జోరందుకుంది. వానాకాలంలో ఆశించిన రీతిలో వర్షాలు కురవడంతో బావులు, బోర్ల కింద వరి, వేరుశనగ పంటలను సాగు చేయగా ఆయకట్టేతర ప్రాంతాల్లో రైతు లు పత్తి, కంది పంటల సాగును అధికం గా చేపట్టారు. వారంరోజుల్లో ప్రాజెక్టు నుంచి నీరు విడుదల కానుండటంతో ఆయకట్టు రైతాంగం వరి పంట సాగుకు సిద్‌ధ్దమవుతోంది.

నియోజకవర్గంలో నెలకొన్న సాగు, తాగు నీటి ఇబ్బందులను శాశ్వతంగా దూరం చేసేందుకు సీఎం కేసీఆర్‌ బృహత్తర సంకల్పంతో చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకం ఈ ప్రాంత రైతుల ఆశలకు జీవం పోస్తోంది. ఈ పథకం వల్ల డిండి ప్రాజెక్టు ద్వారానే జిల్లాలో మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరందడంతోపాటు, ఎన్నో

ఆవాసాలకు తాగు నీరందనుంది. ప్రధాన కాల్వలతో పాటు, ఐదు రిజర్వాయర్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతుండగా ఈ పథకం సాకారం అయ్యేసరికి మరో రెండేళ్ల సమయం పట్టనుంది. ముఖ్యంగా దేవరకొండ, డిండి, చందంపేట, నేరేడుగొమ్ము మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొనగా మంత్రులు జగదీష్‌రెడ్డి, హరీష్‌ రావుల చొరవతో కల్వకుర్తి ఎత్తిపోతల నీటితో దేవరకొండ, డిండి, చందంపేట, నేరెడుగొమ్ము మండలాల పరిధిలోని 36 చెరువులను నింపారు.

 

తాజావార్తలు