డిటెన్షన్‌ విధనంతో డ్రాపవుట్లు పెరుగుతారు

కేంద్రం ప్రయత్నాలపై మేధావుల ఆందోళన

న్యూఢిల్లీ,జూన్‌11(జ‌నం సాక్షి): విద్యా ప్రమాణాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 5,8 తరగతులకు డిటెన్షన్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. దీనిపై కసరత్తు చేసిన కేంద్రం అమలు ఎప్పుడన్నది చెప్పడం లేదు. దీంతో ఫెయిలైన విద్యార్థులు బడికి దూరమయ్యే ప్రమాదముందని విద్యావేత్తలు, ఉపాధ్యాయుల్లోఆందోళన వ్యక్తమవుతుంది. అందరికీ విద్య అనే లక్ష్యం నీరుగారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం డిటెన్షన్‌ విధానంతో కామన్‌ పరీక్షల నిర్వహణ చేపడితే మూల్యంకణం కోసం పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఫెయిల్‌ అయిన విద్యార్థులకు అడ్వాన్స్‌ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించాలి. వారి జవాబు పత్రాలు దిద్దేందుకు మళ్లీ స్పాట్‌ సెంటర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇలా కేంద్రం నిర్ణయంతో డ్రాపౌట్స్‌ పెరగడంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్ధికంగా భారం పడుతుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. డిటెన్షన్‌ విధానంతో విద్యార్థి ఒక సబ్డెక్ట్‌లో ఫెయిల్‌ అయినా ఆ విద్యార్థి పైతరగతులకు వెళ్లే అవకాశం ఉండదు. దీంతో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. ఈ విధానంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందినా వెనుకబడిన విద్యార్థుల పాలిట శాపంగా మారనుంది. డిటెన్షన్‌ విధానం అమలులో భాగంగా పదో తరగతి తరహాలో కామన్‌ పరీక్షలు నిర్వహిస్తే పాస్‌ మార్కులు తప్పనిసరి కానున్నాయి. విద్యార్థి ఏదైనా ఒక సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించకపోతే మేలో తిరిగి పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అప్పుడు కూడా ఉత్తీర్ణత సాధించకపోతే ఆ తరగతిలో కొనసాగాల్సి ఉంటుంది. ఈ మేరకు విద్యాహక్కు చట్టాన్ని సవరిస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ప్రకటించారు. ఈ విద్యా ప్రమాణాలను కేంద్ర విద్యా వ్యవహారాల బోర్డు సిఫారసు చేసినట్లు తెలిసింది. నాణ్యాత ప్రమాణాలను పెంచేందుకు ఉపాధ్యాయ విద్యపై దృష్టి సారించినట్లు సమాచారం. పేద తల్లిదండ్రులు తమ పిల్లలు ఉత్తీర్ణులు కాకపోతే వారికి చదువు సరిగా రావడంలేదని పనులకు తీసుకెళ్లే ప్రమాదముందని విద్యావేత్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో విద్యార్థులు ఇంట్లోనే ఉండడం లేదా వేరే పనులకు వెళ్లే అవకాశాలుంటాయి. వెనుకబడిన విద్యార్థులను గమనించి ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అడ్డుగా మారేలా ఉంది.