డిసిసిబి కైవసానికి టిఆర్‌ఎస్‌ స్కెచ్‌

సంగారెడ్డి,మార్చి3(జ‌నంసాక్షి): జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) అధ్యక్షుడు జైపాల్‌రెడ్డిపై ఉపాధ్యక్షుడు చిట్టి దేవేందర్‌రెడ్డితో పాటు 13 మంది డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానానికి నోటీసులివ్వడంతో ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో కాక రగిలింది. టిఆర్‌ఎస్‌ నేత, మంత్రి హరీష్‌ రావు పక్కా ప్రణాళికతో ఈ వ్యూహాన్ని పన్నారని సమాచారం. మొత్తంగా ఇప్పుడు అంతా అనుకున్నట్లు జరిగితే డిసిసిబి టిఆర్‌ఎస్‌ ఖాతాలోకి వెళుతుంది. సమయం కోసం వేచి చూస్తున్న డైరెక్టర్లు ఎన్నికలు జరిగి రెండేళ్లు పూర్తి కావడంతో సోమవారం అవిశ్వాసం పెట్టారు. వైస్‌ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌తో కలిసి వచ్చిన 13మంది డైరెక్టర్లు అవిశ్వాస పత్రాన్ని అందించారు. 15 రోజుల పాటు పర్యటించి నేరుగా సంగారెడ్డిలో కొత్త కార్యవర్గ ఎన్నికకు రానున్నట్లు సమాచారం. క్యాంపు నుంచి వారంతా ఒకే వాహనంలో కలెక్టరేట్‌కు వచ్చి ఇన్‌ఛార్జి డీసీవో సత్యనారాయణరెడ్డికి ఈ మేరకు పత్రం అందజేశారు. గడచిన ఎన్నికల్లో డీసీసీబీని కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మొత్తం 20 డైరెక్టర్లతో కూడిన బ్యాంకుకు ప్రస్తుతం జైపాల్‌రెడ్డి చైర్మన్‌గా, చిట్టి దేవేందర్‌రెడ్డి వైఎస్‌ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎన్నిక జరిగి ఫిబ్రవరి 19 నాటికి సరిగ్గా 2 సంవత్సరాలు పూర్తయింది. రెండేళ్లు పూర్తయితే అవిశ్వాసం పెట్టుకునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే   వైస్‌ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డితో సహా 14మంది డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఈ సందర్భంగా తెరాస నేత, రామాయంపేట మండలం కోనాపూర్‌ సొసైటీ చైర్మన్‌ ఉప సభాపతి పద్మ భర్త అయినా దేవేందర్‌రెడ్డి , డీసీసీబీ ఉపాధ్యక్షుడు చిట్టి దేవేందర్‌రెడ్డిలు ఇందులో కీలక భూమిక పోషించారు. మొత్తానికి టిఆర్‌ఎస్‌ వ్యూహంలో భాగంగా ఇప్పుడు డీసీసీబీని కైవసం చేసుకునే పనిలో పడ్డారు. ఇది అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిందని,  రైతుల కోసం పనిచేయడం లేదని, కోట్ల మేర అవినీతి జరిగినట్లు ఆడిట్‌లోనూ తేలిందని ఆరోపించారు. తమకు 20 మంది డైరెక్టర్ల మద్దతు ఉందని.. మరికొందరు కూడా తమవైపు ఉన్నారని చెప్పారు. అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి రైతుల కోసం పనిచేయడం లేదని ఆరోపించారు. ఆయన తీరు నచ్చకనే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు, ఉప సభాపతి పద్మ సహకారంతో సంఘాలను బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. డీసీసీబీ అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన తర్వాత డైరెక్టర్లు క్యాంపునకు వెళ్లినట్లు తెలుస్తోంది. మూడు రోజుల నుంచి వారు క్యాంపులోనే ఉండటం గమనార్హం. దీంతో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)ను కైవసం చేసుకోవడానికి టీఆర్‌ఎస్‌ ప్రయత్నాలు షురూ చేసింది. డీసీసీబీలో మొత్తం 21 డైరెక్టర్‌ స్థానాలుండగా ఒక ఎస్టీ స్థానికి అభ్యర్థులు లేకపోవడంతో ఆ స్థానానికి ఎన్నిక నిర్వహించలేదు. మిగతా 20 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా అన్ని స్థానాలను అప్పడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకున్నది. రెండేళ్ల కిత్రం జిల్లాలో ఓ వెలుగువెలిగిన గీతారెడ్డి, దామోదర రాజనరసింహ, జగ్గారెడ్డి లాంటి నేతలు డీసీసీబీ కైవసం చేసుకోవడంలో కృషి చేశారని చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గాను 8 స్థానాలను, రెండు పార్లమెంట్‌ స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవడం, పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.  అధికారంలోకి వచ్చిన 7నెలల కాలంలో జిల్లాలో రాజకీయాల్లో ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగానే డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ చిట్టీ దేవేందర్‌రెడ్డి గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డితో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనతో పాటు మెజార్టీ డీసీసీబీ డైరెక్టర్లు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు అదనుకోసం చూసి సమయం కలసిరాగానే రాజీకయాలకు తెరలేపారు.