డిసెంబర్‌లోగా రికార్డుల ప్రక్షాళన
భద్రాద్రి కొత్తగూడెం,నవంబర్7(జనంసాక్షి): జిల్లాలో భూరికార్డుల ప్రక్షాళనను డిసెంబర్‌లోగా పూర్తిచేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ టీ వినయ్‌కృష్ణారెడ్డి స్పష్టంచేశారు.కోర్టుకేసులు, పెద్ద ఎత్తున సర్వే సమస్యలు ఉన్న భూముల సర్వేను డిసెంబర్ తర్వాత చేపడతామని జేసీ చెప్పారు. భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా వ్యవసాయ, వ్యవసాయేతర, ప్రభుత్వ భూములను గుర్తించి సమగ్ర సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ఉంచటం జరుగుతున్నదన్నారు. ఇప్పటి వరకు 40 వేల సర్వే నెంబర్లను సరిచేసి ఆన్‌లైన్‌లో పొందుపర్చడం జరిగిందని జేసీ తెలిపారు. రైతులకు వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వం ఎకరానికి రూ. 4 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందించాలనే నిర్ణయం తీసుకున్నదని పేర్కొన్నారు. దీనికిగాను నిజమైన రైతులకే ప్రభుత్వ పరిహారాన్ని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం జరుగుతున్నదన్నారు. దీనిలో భాగంగానే ఖమ్మం జిల్లాలో సైతం భూవివరాలను సమగ్రంగా నిర్ధారించేందుకు భూరికార్డుల ప్రక్షాళనకు 50 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 243 రెవెన్యూ గ్రామాలలో ఈ పక్రియ ప్రారంభమైందని వెల్లడించారు. డబుల్ బెడ్‌రూం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు ఇసుక కొరత లేదన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవో, పోలీస్ అధికారులకు జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారని అన్నారు.



