డిసెంబర్‌ 9 ప్రకటనకు కట్టుబడకపోతే

విద్యార్థులతో కలిసి విస్తృత ఉద్యమం
కోదండరామ్‌
హైదరాబాద్‌, జనవరి 21 (జనంసాక్షి) :
కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్‌ 9న చేసిన ప్రకటనకు కట్టుబడకపోతే విద్యార్థుల తో కలిసి విస్తృత ఉద్యమం నడుపుతామని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. సోమవారం నగరంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద 28న చేపట్టనున్న విద్యార్థి మహా ప్రదర్శన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడా రు. కేంద్రం గత నెలలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో నెలరోజుల్లోగా తెలంగాణపై తేల్చేస్తామని ప్రకటించిందని ఆ ప్రకటనకు కట్టుబడి ఉండాలని డిమాండ్‌ చేశారు. 2009 డిసెంబర్‌ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం విద్యార్థులు, ప్రజల చేతుల్లోకి వెళ్లిపోయిందని  తెలిపారు. వారిని కేంద్రంగా చేసుకునే ఇంతకాలం పోరాటం సాగిస్తున్నామని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు పన్నని కుయుక్తులు లేవని, అయినా వెనక్కి తగ్గేది లేదన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజాసంఘాల పాత్ర ఉద్యమంలో అత్యంత కీలకమైనదని అభివర్ణించారు. తెలంగాణ ప్రజాఫ్రంట్‌ చైర్మన్‌ వేదకుమార్‌ మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు సమాంతరంగా ప్రజాఫ్రంట్‌, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమం సాగుతోందని అన్నారు. ప్రజలు, విద్యార్థుల పోరాటంతోనే ప్రజాప్రనిధులు అనివార్యంగా ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. తెలంగాణపై అఖిలపక్షంలో ఒక నిర్ణయం ప్రకటించిందని ఆ నిర్ణయానికి వందశాతం కట్టుబడి ఉండాలని డిమాండ్‌ చేశారు. ప్రజాఫ్రంట్‌, ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 28న చలో హైదరాబాద్‌కు పిలపునిచ్చామన్నారు. తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ 27న చేపట్టనున్న సమరదీక్షను అవసరమైతే రెండు, మూడు రోజులు కొనసాగించేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. ఒకవేళ కేంద్రం గనుక తెలంగాణ ఏర్పాటుపై వెనక్కు తగ్గితే కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు పదవులు, పార్టీకి రాజీనామా చేసి ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలా ముందుకురాని నేతలకు నియోజకవర్గాల్లో పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టఫ్‌ కో చైర్మన్‌ విమలక్క తదితరులు పాల్గొన్నారు.