డిసెంబర్ 8వ తేదీ వరకు రంగంపేట మండల ఏర్పాటు ప్రకటన ఇవ్వాలి
ఏ ఒక్క పార్టీ మాతో కలిసి రాలేదు. * దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు * టిఎంఆర్పిఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు పుర్ర ప్రభాకర్ ఆవేదన ,జనం సాక్షి /కొల్చారం ఈనెల 8వ తేదీ వరకు రంగంపేటను మండల కేంద్రంగా ప్రకటించకుంటే మండల సాధన కోసం దళిత సంఘాల ఆధ్వర్యంలో కొల్చారం మండలం రంగంపేటలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు పుర్ర ప్రభాకర్ పేర్కొన్నారు. రంగంపేటను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ మంగళవారం సంగాయిపేట నుండి ప్రారంభించిన పాదయాత్ర రెండవ రోజు పైతర, తుక్కాపూర్ మీదుగా రంగంపేటలో ముగిసింది. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన దళిత సంఘాల నాయకులు రంగంపేట మండల కేంద్రంగా ప్రకటించాలంటూ నినాదాలు చేశారు.అనంతరం ప్రభాకర్ మాట్లాడుతూ తాము చేపట్టిన పాదయాత్రకు దళిత సంఘాల కు చెందిన నాయకులు మాత్రమే పాల్గొనడం,రంగంపేట తో పాటు సమీప గ్రామాల ప్రజా ప్రతినిధులు,పార్టీలు, ఇతర యువజన సంఘాలు మద్దతుగా రాకపోవడం దళితులను అవమానించడమేనన్నారు.ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.మండల కేంద్రం ఏర్పాటు పై స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి,జిల్లా మంత్రి హరీష్ రావు,స్థానిక జెడ్పీటీసీ,ఎంపీపీ, సర్పంచుల పైనే భారం వేస్తున్నామన్నారు.ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే మండల కేంద్రం ఏర్పాటు పై తాను ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలన్నారు.దళితులను ఓటు బ్యాంకు గానే చూస్తున్నారన్న విషయం ఈ పాదయాత్ర ద్వారా స్పష్టమైందన్నారు. దళితులను ఓటు బ్యాంకు గానే చూస్తామనుకుంటే ఎన్నికల్లో దళితుల ఓట్లను అడగవద్దని, రంగంపేటను మండల కేంద్రంగా ప్రకటించినప్పుడు దళితుల ఓట్లు అడగవలసిన హక్కు లేదన్నారు.తాము చేపట్టిన ఈ ఉద్యమానికి ఎవరు మద్దతుగా రాకపోయినా, దళిత సంఘాల ఆధ్వర్యంలో మండల సాధన కోసం విడతల వారీగా ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు.దళితులు చేపట్టే ఈ ఉద్యమం ఏ స్థాయిలో ఉంటుందన్నది ప్రజా ప్రతినిధులకు రుచి చూపిస్తామంటూ హెచ్చరించారు.జిల్లా కలెక్టర్,ఎస్పీల అనుమతితో నిరాహార దీక్ష చేపట్టడం ఖాయమన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్,ఎంఎస్ఎఫ్, అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.