డీఎంకే ఎమ్మెల్యేలకు దక్కని ఊరట

71471854620_625x300చెన్నై: తమిళనాడు ప్రధాన ప్రతిపక్ష డీఎంకే ఎమ్మెల్యేలకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించలేదు. ఎమ్మెల్యేల సస్పెన్షన్ నిలుపుదల చేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. అసెంబ్లీ స్పీకర్ పి. ధనపాల్ కు నోటీసు జారీ చేసింది. ఈ వ్యవహారంపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

స్టాలిన్ సహా 89 మంది డీఎంకే ఎమ్మెల్యేలను ఈ నెల 18న అసెంబ్లీ నుంచి వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. దీంతో మార్షల్స్ రంగప్రవేశం చేసి డీఎంకే సభ్యులను బలవంతంగా బయటకు పంపివేశారు. స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 19న డీఎంకే సభ్యులు శాసనసభ ప్రాంగణంలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. అనుమతి లేకుండా ప్రవేశించినందుకు స్టాలిన్ సహా 60 మంది డీఎంకే ఎమ్మెల్యేలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

నిరంకుశ అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రతిపక్షంపై వేధింపులకు పాల్పడుతోందని, తమను అరెస్ట్ చేసినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని స్టాలిన్ అన్నారు. జైలు కెళ్లేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.