డీఎస్సీ నోటిఫికేషన్‌ లేనట్లేనా?

మెదక్‌:సర్కార్‌ నిరుద్యోగులతో ఆటలాడుకుంటోంది. ఉద్యోగాల భర్తీలో వివిధ కారణాలను చూపుతూ గడిపిన ప్రభుత్వం… ఇప్పుడు రేషనలైజేషన్‌ పేరిట డీఎస్సీకి మంగళం పాడే యోచనలో ఉన్నట్టు తెలిసింది. దీంతో నిరుద్యోగులు విస్మయానికి గురవుతున్నారు. గతేడాదిన్నర కాలంగా ఉద్యోగాల భర్తీపై రకరకాల సాకులను చూపుతూ ప్రభుత్వం దాటవేత ధోరణిని అవలంభించింది. డీఎస్సీ నియామకాలపై మాత్రం కరాఖండిగా వ్యవహరించింది. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా కమలనాథన్‌ కమిటీ పేరిట ఆడిన నాటకం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం మెదక్‌జిల్లాలో జీవో 610 మేరకు ఇతర జోన్లకు చెందిన ఉపాధ్యాయులను పంపించేస్తారని అనుకున్నప్పటికీ అలా జరగలేదు. జోనల్‌ పోస్టులకు కమలనాథన్‌ కమిటీకి సంబంధం లేకపోయినా వాటిని ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో జీవో 610 అమలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రశ్నార్థకంగా మారింది. జిల్లా, జోనల్‌ పోస్టుల్లో పనిచేసిన ఉద్యోగులందరూ ఆయా రాష్ట్రాలకు కేటాయించబడతారని ఆంధ్రప్రదేశ్‌ పుఃనర్‌వ్యవస్తీకరణ చట్టం-2014 స్పష్టం చేస్తోంది. ఈ చట్టం మేరకు డీఎస్సీ నియామకాలకు, కమలనాథన్‌ కమిటీకీ సంబంధం లేదు. ఆమేరకు ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ కమలనాథన్‌ కమిటీ పేరిట విద్యాశాఖ అధికారులు సుమారు 8 నెలలపాటు దాటవేత ధోరణిని అవలంభించారు. 2014 జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకు ఉపాధ్యాయ నియామకాలకు కమలనాథన్‌ కమిటీతో సంబంధం ఉందని చెబుతూ వచ్చారు. అయితే జోనల్‌ క్యాడర్లకు ఈ విషయం తెలియజడంతో రేషనలైజేషన్‌ను తెరపైకి తెచ్చారు. మరో 8 నెలల పాటు కాలయాపన చేశారు. రేషనలైజేషన్‌ మూలంగా 2,500 పైగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు 1,104కు చేరుకున్నాయి. వాటికి కూడా రెగ్యులర్‌ ఉపాధ్యాయులతో నింపకుండా విద్యావలంటీర్లతో భర్తీ చేసేందుకు సర్కారు సిద్ధమయ్యింది. జిల్లా వ్యాప్తంగా 1,104 ఖాళీలను విద్యాశాఖ గుర్తించింది. వాటి భర్తీకి జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలోని కమిటీ నోటిఫికేషన్‌ జారీచేసింది. ఆ గడువు శుక్రవారంతో ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 1,104 పోస్టులను విద్యావలెంటర్లతో భర్తీ చేస్తున్నారు. దీంతో డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం ఈసారి మొండి చేయి చూపింది. దీంతో నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్ష ఉద్యోగాలంటూ ముందుకొచ్చిన సీఎం కేసీఆర్‌ ఈ విధంగా వ్యవహరించడం సరైంది కాదంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఆయా శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

తాజావార్తలు