డీఎస్సీ రద్దు
– టీఎస్‌పీఎస్సీ ద్వారా అధ్యాపకుల నియామకం
– తెలంగాణ సర్కారు నిర్ణయం
హైదరాబాద్,మే18(జనంసాక్షి):తెలంగాంణ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. టీఎస్‌పీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈమేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరుగుతూ వస్తోంది. ఈ నిర్ణయంతో తెలంగాణలో జిల్లాల వారీగా డీఎస్సీ లేనట్టుగా స్పష్టమైంది. డీఎస్సీ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తాజా ఉత్తర్వులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో ఇకముందు టీఎస్‌పీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరగనుంది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ డీఎస్సీకి బదులు టీఎస్‌పీఎస్సీ ద్వారా జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఉపాధ్యాయుల నియామకం తీరుతెన్నులు ఒక్కసారిగా మారిపోనున్నాయి. ఇన్నాళ్లూ జిల్లా సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా చేపట్టిన టీచర్ల నియామక పద్ధతికి తెలంగాణ సర్కారు చరమగతం పాడింది. ఆ స్థానంలో.. ఉపాధ్యాయులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మాత్రమే నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్య కమిషనర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య ఉత్తర్వులను జారీచేశారు. ప్రత్యక్ష నియామకాలను రద్దుచేసి, వాటిని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అప్పగించడానికి ఎంతవరకు వీలవుతుందో పరిశీలించాలని జీఏడీని కోరిన మేరకు.. తెలంగాణ పాఠశాల విద్య డైరెక్టర్ పరిధిలో ఉన్న అన్ని రకాల టీచర్ పోస్టులను ప్రత్యక్ష నియామక పద్ధతి నుంచి తప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో స్కూలు అసిస్టెంట్లు, భాషా పండితులు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, పీఈటీలను ఇన్నాళ్లుగా డీఎస్సీల ద్వారా నియమిస్తుండగా.. ఇకపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) ద్వారా మాత్రమే నియమిస్తారు. ఏకరూపత, స్థిరత్వం, సరైన ఎంపిక పద్ధతుల కోసం ఇలా చేసినట్లు బుధవారం విడుదల చేసిన జీవో నెం. 19లో పేర్కొన్నారు. పాఠశాల విద్య డైరెక్టర్ నియంత్రణలో ఉన్న మోడల్ స్కూళ్లలో ఉన్న ప్రిన్సిపాళ్లు, పీజీ టీచర్లు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ల పోస్టులను కూడా టీఎస్‌పీఎస్‌సీ ద్వారానే నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శి, పాఠశాల విద్య డైరెక్టర్ తదితరులు తగు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులలో తెలిపారు. ఇకముందు టీఎస్‌పీఎస్సీ ద్వారానే ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరగనుంది. సరైన ఎంపిక విధానం, స్థిరత్వం, ఒకే తరహా పద్ధతి కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్టపికే పోస్టుల ఎంపికను తమకు అప్పగించాలని గతంలోనే టిపిఎస్సీ సూచించింది. దీంతో ఆ బాధ్యతను దానికి అప్పగించారు.